నాగర్‌కర్నూల్ రూరల్ / పాలకుర్తి/లక్ష్మణచాంద, ఏప్రిల్ 16 : మక్కల కొనుగోలు చేపట్టక పోవడంపై రైతులు సర్కార్‌పై మండిపడ్డారు. పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం పలుచోట్ల రోడ్డెక్కారు. మక్కజొన్న తీసుకొచ్చి ఐదు రోజులవుతున్నా కొనుగోలు చేపట్టడం లేదంటూ రైతులు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ గేటు సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. కొందరి మక్కలు కొనుగోలు చేసినా.. లారీలకు ఎత్తడం లేదని, దళారులతో అధికారులు కుమ్మక్కై ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గన్నీ బ్యాగులు లేవంటూ.. లారీలు అందుబాటులో లేవంటూ కుంటి సాకులు చెబుతూ కాంటా వేయడం లేదని వాపోయారు. వర్షం పడితే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు.
ఇదే అదునుగా భావించిన దళారులు తక్కువ ధరకు కొనేందుకు తమ ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. సుమారు గంటసేపు ధర్నా చేపట్టడంలో కిలోమీటర్ పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారుల హామీతో ఆందోళన విరమించారు. ఈ నెల 23వ తేదీ వరకు మార్కెట్‌కు ధాన్యం తీసుకురావొద్దని, ఇక్కడ సరిపడా స్థలం లేదంటూ అధికారులు గేటుకు నోటీసు అంటించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వద్ద మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. ఐదు గ్రామాలకు చెందిన వందమందికిపైగా రైతులు గంటపాటు బైఠాయించారు. ఏఈవో, తహసీల్దార్ చేరుకొని, ఊరూరా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డును మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించారు. రైతులు కన్నీరు పెడుతూ ఎర్రబెల్లికి తమ గోస చెప్పుకొన్నారు. చలించిన ఎర్రబెల్లి వెంటనే మార్క్‌ఫెడ్ డీఎంతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వివరించారు. రైతులకు బస్తాలు, లారీలను అందుబాటులో ఉంచాలని సదరు అధికారిని కోరారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వారం రోజుల్లో మక్కలు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతుల తరఫున పోరాటం చేస్తానని హెచ్చరించారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడ్డారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అమలు కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. రైతులకు రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టాడని, ధాన్యానికి మద్దతు ధర లేదని మండిపడ్డారు.