చందంపేట, జనవరి 19 : సాంకేతిక సమస్యతో యూరియా పొందలేకపోతున్నామంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. దాదాపు గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వారం రోజులుగా యాప్‌లో బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా జీరో స్టాక్ చూయిస్తుందని అన్నారు. అయినప్పటికి కొంతమంది బుక్ చేసుకోగా యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు తెలిపారు. తీరా బయోమెట్రిక్ సమస్య తలెత్తడంతో ఓపిక నశించి ధర్నాకు దిగాల్సి వ చ్చిందని చెప్పారు. అధికారులు స్పందించి యూరియా ఐడీ నంబర్ ఆధారంగా యూ రియా పంపిణీ చేయడంతో శాంతించారు.
ఎల్లారెడ్డిపేట, జనవరి 19: యూరియా దొరక్క ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణంలో తీసుకుంటే నాసిరకం వచ్చిందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. వెంకటాపూర్‌కు చెందిన రైతు కొమ్మేటి ప్రవీణ్ తనకున్న నాలుగున్నరెకరాల్లో వరి వేశాడు. దీంతో ఓ ఫర్టిలైజర్ దుకాణంలో సోమవారం రూ.300కు ఒక బ్యాగు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. బస్తా కొంటే అదనంగా రూ.600 ఖరీదు చేసే బయోజెమ్ కొనాలనే నిబంధన పెట్టినప్పటికీ అదనంగా రూ.2400 ఖర్చు చేసి నాలుగు బస్తాలు తీసుకున్నాడు. తీరా తన పొలంలో వేస్తున్న సమయంలో యూరియా నుంచి దుమ్ము వచ్చిందని రైతు ఆరోపించాడు. వెంటనే వ్యవసాయాధికారికి ఫోన్ చేసి విషయాన్ని తెలిపినట్టు చెప్పాడు. దీనిపై వ్యవసాయ అధికారి రాజశేఖర్‌ను వివరణ కోరగా రైతు వద్ద ఉ న్న యూరియాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.