కామారెడ్డి రూరల్, జూలై 14: కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది బిగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో సోమవారం రైతులు ధర్నాకు దిగారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పది రోజులవుతున్నా.. దానిని విద్యుత్ అధికారులు మార్చడం లేదని, మరమ్మతులు చేయడం లేదని వాపోతున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అదే రోజుగానీ, మరుసటి రోజుగానీ మార్చాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
ట్రాన్స్ఫార్మర్ మార్చాలని ఏఈ, డీఈలకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో నీటి సరఫరా నిలిచి పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే వానలు లేక పంటలు వాడిపోతున్నాయని, ఇప్పుడు విద్యుత్తు సరఫరా లేక సుమారు 80 ఎకరాల్లో వేసిన వరి, పత్తి, మక్కజొన్న పంటలు నీరందక ఎండిపోతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.