Paddy Procurement | వర్ధన్నపేట, ఏప్రిల్ 30 : వరి కోతలు ప్రారంభమై 20 రోజులైనా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం రైతులు బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు. పంటను కోసి ధాన్యాన్ని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద రాశులు పోసుకున్నా అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించ లేదని మండిపడ్డారు. గతేడాది జరిగిన కొనుగోళ్లలో తప్పులు జరిగాయని ఈ ఏడాది కేంద్రాన్ని నిలిపివేయడం సరికాదని అన్నారు. వర్షానికి ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.
మరిపెడ/చిన్నగూడూరు, ఏప్రిల్ 30: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం తెచ్చి పదిరోజులైనా కొనుగోలు చేయడం లేదని, వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కూసుమంచి, ఏప్రిల్ 30 : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండ లం చేగొమ్మ క్రాస్‌రోడ్డు వద్ద ఖమ్మం-సూర్యాపేట పాత రహదారిపై సీపీఎం నాయకులతో కలిసి రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరిస్తామని కూసుమంచి ఎస్సై నాగరాజు, మండల వ్యవసాయాధికారి ఆర్ వాణి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.