జగిత్యాల టౌన్, అక్టోబర్ 4: జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 2వేలకు మందికిపైగా తరలిరాగా, పాత మార్కెట్ బీటు నుంచి పాదయాత్రగా జగిత్యాల కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందన్న నమ్మకంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచి గద్దెనెక్కించారని, కానీ గెలిచిన తర్వాత మోసం చేశారని విమర్శించారు.
వాగ్దానాలు అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించి రైతుల్లో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసి మిగతా 60 శాతం మందిని గాలికొదిలేశారని ఆరోపించారు. రుణమాఫీ అమలులో లేనిపోని ఆంక్షలు విధిస్తూ రైతులను రోడ్డుపాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీలో రేషన్‌కార్డు అంటూ ఆంక్షలు విధించడం దారుణమని, బ్యాంకులు ఇచ్చిన రుణాల ఆధారంగా చేసుకొని రుణమాఫీ హామీని వంద శాతం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి, నాయకులు వేముల కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు తరలివెళ్లి ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రైతులు దాదాపు 5 గంటలపాటు నిరసన వ్యక్తం చేసినా, కలెక్టర్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకొని బారికేడ్లను తోస్తూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన రైతు బద్దం మహేందర్‌రెడ్డి సొమ్మసిల్లిపోగా, పోలీసులు దవాఖానకు తరలించారు. నిరసన విషయం తెలుసుకున్న కలెక్టర్ అక్కడికి రాగా, రైతులు తమ డిమాండ్లను విన్నవించారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.