నమస్తేనెట్వర్క్ : ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ జాప్యంపై అన్నదాత దిగాలు చెందుతున్నాడు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెలన్నర దాటుతున్నా వివిధ కారణాలతో మిల్లులకు తరలించడం ఆలస్యమవుతుండటంతో అక్కడే వేచి చూడటం అన్నదాతకు తప్పడం లేదు. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు రైతన్నను మరింత ఇబ్బంది పడుతున్నాయి. దీంతో సర్కార్ తీరుపై రోడ్డెక్కి నిరసన తెలుపాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలు ప్రాంతాల్లో రైతులు నిరసనబాట పట్టారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం, అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ గురువారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామ రైతులు రోడ్డుపై వడ్లు పోసి, తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
పలువురు రైతులు మాట్లాడుతూ.. ఐకేపీ కేంద్రాలకు వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ఇంతవరకు కాంటా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, సంబంధిత అధికారులు రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల రైతులు చిట్కుల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. చిట్కుల్ చాముండేశ్వరీ రైస్‌మిల్‌కు ట్రాక్టర్లలో తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసిందని, వేరే రైస్‌మిల్‌కు తీసుకెళ్లాలని రెవెన్యూ జీపీవోలు రైతులకు చెప్పారు. దీంతో రైతులంతా ఆందోళనకు దిగారు. అధికారులతో ఎస్సై ఫోన్లో మాట్లాడించి హామీ ఇప్పించడంతో ఆందోళన విరమించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం లగ్గాంలో ధాన్యానికి రైతులు గురువారం నిప్పుపెట్టి నిరసన తెలిపారు. నెలలు గడుస్తున్నా వడ్లు కొనడం లేద ని, అకాల వర్షాలకు అరిగోస పడుతున్నా ప ట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పారబట్టిన ధాన్యానికీ క్వింటాలుకు 2 నుంచి3 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని, తాలు పేరిట మరింత కటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. సర్కార్ వైఖరిని నిరసిస్తూ ధాన్యానికి నిప్పు పెట్టి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి చప్పిడ బక్కయ్య, కల్లం ఇన్చార్జి తుమ్మిడ నారాయణతో పాటు ఎస్ఐ చుంచు రమేశ్ కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని మంటలు ఆర్పి వేయించారు. ఆపై రైతులతో చర్చలు జరిపారు.
కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెల రోజులైంది. కాంటా అయితలేవు.. కాంటా అయిన వడ్లు లారీలు రాక తీసుకుపోవడం లేదు. వడ్లు ఎండకు ఎండి తూకం తక్కువ అవుతున్నది. తరుగు ఎక్కువ పోతదని భయపెడుతున్నరు. మా పరిస్థితి ఆగమాగమున్నది. ఈ సర్కార్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి. గింత అన్యాయం చేస్తరనుకోలే.