అర్వపల్లి, మే 9 : కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని నిరసిస్తూ రైతులు ధాన్యానికి నిప్పు పెట్టారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో శుక్రవారం 365వ నంబర్ జాతీయ రహదారిపై వడ్లకు నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు. ప్రతి సెంటర్కు లారీలను పంపించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, మిల్లర్లు రైతుల దగ్గర ఒక లారీకి ఐదు క్వింటాళ్లు కట్ చేస్తున్నారని, వారి పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కిరణ్ మాట్లాడుతూ.. ఐకేపీ సెంటర్లు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా వడ్ల కొనుగోలు వేగవంతం కావడం లేదని ఆరోపించారు. దాంతో జాజిరెడ్డిగూడెం ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెడ్తలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ధాన్యానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకున్నది. తొర్రూరు మండలం హరిపిరాల, కరాల రైతులు రెండు ట్రాక్టర్లలో ధాన్యంతో తొర్రూరులోని గాంధీ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యాన్ని తగులబెట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వారిని కలిసి సంఘీభావం తెలిపారు. – తొర్రూరు
గన్నీ సంచులు సకాలంలో అందించకపోగా, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక ఫిరంగిగడ్డ వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సై రాజు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. – వర్ధన్నపేట