బెజ్జంకి, సెప్టెంబర్ 25 : రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా తోటపల్లిలో ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ బ్యాంకు బ్రాంచి పరిధిలో 1,407 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 400 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించింది.
మిగతా వారికి మాఫీ కాకపోవడంతో గత నెల ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వివరాలు పంపామని బ్యాంకు అధికారులు చెప్పినా, ఇప్పటికీ మాఫీ కాకపోవడంతో బుధవారం బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలిపారు. అర్హులైన రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకులు మద్దతు తెలపారు.