అక్కన్నపేట, జనవరి 3: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు నిరసన తెలిపారు. వారికి బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, సింగిల్ విండో డైరెక్టర్ మ్యాక నారాయణ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ముత్తినేని వేణుగోపాల్‌రావు మద్దతు తెలిపారు.
రెండు లక్షలపై ఉన్న రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో తమను మోసం చేసిందని ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనలు, షరతులు, కొర్రీలు పెడుతూ తూతూమంత్రంగా రుణమాఫీ చేసిందని మండిపడ్డారు.
ప్రతి గ్రామంలో నేటికీ రుణమాఫీ కానీ రైతులు ఉన్నారని చెప్పారు. రైతు భరోసా ఇవ్వక పోవడంతో పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు బోనస్ ఇవ్వకుండా కాలం గడిపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.