వర్గల్, జూలై 30: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిందని బీఆర్ఎస్ నేత, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే గోదావరి జలాల తరలింపు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద కొండపోచమ్మసాగర్ రామాయంపేట-సంగారెడ్డి లింక్ పాయింట్ వద్ద రైతులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వాయర్లు నింపి కాలువల ద్వారా సాగునీరు ఇవ్వకపోతే వేలాదిమంది రైతులతో కలిసి రాజీవ్ రహదారిని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఎల్లంపల్లి, సుందిళ్ల, మల్లన్నసాగర్, తపాస్‌పల్లి రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్, అనంతగిరి వంటి ప్రాజెక్టులు నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగాయని మొత్తం ప్రాజెక్టులకే ఎత్తిపోతలు బంద్చేస్తే ఇక తెలంగాణ రైతాంగం బతికేదెట్లా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్లో 7 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 4 టీఎంసీలు నిల్వ ఉన్నప్పటికీ వానకాలం వరినాట్ల కోసం చుక్క నీటిబొట్టు విడిచిపెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు తీరుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదని అన్నారు. 6 గ్యారెంటీల అమలు గాలికొదిలేశారని విమర్శించారు. కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నుంచి తుర్కపల్లి, జగదేవ్‌పూర్ మండలాల మీదుగా వెళ్లే కెనాల్‌కు, అలాగే రామాయంపేట – సంగారెడ్డి కాలువల్లోకి నీరు వదలకపోతే రెండు,మూడు రోజుల్లో కార్యాచరణ రూపొందించి రైతాంగం పరిరక్షణ కోసం రాజీవ్ రహదారిని దిగ్బంధించేందుకు బీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీల మద్దతుతో ముందుకెళ్తామని ప్రకటించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతాప్‌రెడ్డి కెనాల్‌ను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు వీడాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో వర్గల్ మండల బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.