జనగామ, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ధాన్యానికి మద్దతు ధర రావడంలేదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. దసరా సెలవుల తర్వాత మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఎడగారు చివరి ధాన్యం సహా వానకాలం వడ్లు సోమవారం పెద్దఎత్తున మార్కెట్‌కు వచ్చింది. వ్యాపారులు ఇదే అదనుగా తేమ, తాలు, నాణ్యత వంటి సాకులు చూపి క్వింటాలుకు రూ.1400 నుంచి రూ.1500 మాత్రమే ధర నిర్ణయించి కొందరు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. మరికొందరు రైతులు ఇదేం ధర.. ఇదెక్కడి న్యాయం అంటూ బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి మార్కెట్ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. గిట్టుబాటు ధర లభించకుంటే మీరేం చేస్తున్నారంటూ చైర్మన్ శివరాజ్ యాదవ్‌ను నిలదీశారు.
వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.1400 ఇస్తే రైతులు ఏమైపోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాలతో అదే సమయంలో మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం, మక్కజొన్నలను పరిశీలిస్తున్న మాజీ మార్కెట్ చైర్మన్లు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, బీఆర్ఎస్ నాయకుల వద్దకు వెళ్లి రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మద్దతు ధర ఇవ్వకపోతే వెంటనే కొనుగోళ్లు ఆపేయాలని డిమాండ్ చేశారు. మారెట్ యార్డులో అప్పటికే వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలుచేసిన కాంటాలు నిలిపివేయించారు.
తమ గోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై దుమ్మెతి పోశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.2,100 పలికిన ధర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.1400 నుంచి రూ.1500 ఎలా అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో 3 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని, అప్పుడు రైతులంటే ఏమిటో కాంగ్రెస్ పార్టీకి చూపిస్తామని మార్కెట్ చైర్మన్‌ను హెచ్చరించారు. ఇంకో 30 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా చూసుకుంటామని తెగేసి చెప్పారు. ఇప్పటికైనా మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.