చొప్పదండి, జనవరి 23: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లిలోని చెరువులో ఉన్న మోటర్లను తొలగించాలని చిట్యాపల్లి, రాగంపేట, దేశాయిపేట గ్రామస్థులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు మినీ ట్యాంక్ బండ్‌పై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్లంపల్లి పైపులైన్ నుంచి మినీ ట్యాంక్‌బండ్ చెరువుకు నీరు పుషలంగా ఉండేదని, ఆయకట్టుకు నీరు అంది సాగు చేసుకున్నట్టు తెలిపారు.
చెరువులో ఇప్పుడు నీరు లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి నీటిని చెరువుపై ఉన్న గ్రామస్తులు మోటర్లు పెట్టుకొని పంపింగ్ చేసుకోవడంతో కింది సమస్య వస్తుందని చెప్పారు. చెరువులో నీరు లేక చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే మినీ ట్యాంక్ బండ్ చెరువు నింపి ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు. సీఐ ప్రకాశ్ గౌడ్, ఎస్సై అనూష ఘటనా స్థలానికి వెళ్లి ఇరు గ్రామాల రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.