కొడకండ్ల : పదిరోజులుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా ఇబ్బందిపడుతున్నామని జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల, నర్సింగాపురం గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం వారు ఏడునూతుల సబ్‌స్టేషన్‌ను ముట్టడించి, రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానలు లేక వరినార్లు పోసేందుకు నీళ్లు లేవని, బావులు, బోర్ల నుంచి నీళ్లు పెట్టుకుందామంటే కరెంటు కోతలు ఎక్కువయ్యాయని ఆవేదన చెందారు. ఇలాగైతే వ్యవసాయం కష్టమని, సబ్‌స్టేషన్ ఉన్నా తరచూ కరెంటు తీసేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ హయంలో తాగునీటి సమస్యలు ఎక్కువ అయ్యాయని , సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని 11వ వార్డుకు చెందిన మహిళలు గురువారం మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. తమ వార్డులోని బోరు బావికి అమర్చిన విద్యుత్తు మోటరు చెడిపోయి 20 రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించడం లేదని, దాదాపు 40 కుటుంబాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
– చెన్నూర్