ఐనవోలు, ఏప్రిల్ 16 : మిల్లర్లు తరుగు పేరుతో అధికంగా కటింగ్లు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును రైతులు నిలదీశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని నందనం సొసైటీ ఆధ్వర్యంలో రాంనగర్ రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతుండగా.. రైతు జున్న యాదగిరి అడ్డుచెప్పారు. ‘మిల్లర్లు తరుగు పేరుతో ధాన్యాన్ని అధికంగా తీసుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశాడు. మరో రైతు జున్న ఐలయ్య మాట్లాడుతూ.. గతేడాది ధాన్యం రవాణా పైసలు ఇంకా రాలేదన్నారు. ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు గాని, సంబంధిత అధికారులకు గాని ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఎమ్మెల్యే అనడంతో రైతులు ఒక్కసారిగా లేవడంతో గందరగోళ వాతావరణం నెలకొన్నది. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పడంతో రైతులు శాంతించారు.
ఎమ్మెల్యే ‘జారే’కు నిరసన సెగ ; సొంత పార్టీ కార్యకర్తలే నిలదీసిన వైనం
చండ్రుగొండ, ఏప్రిల్ 16 : భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. బుధవారం ఇందిరమ్మ బడిబాటలో పాల్గొనేందుకు మహ్మద్నగర్కు వెళ్లిన ఎమ్మెల్యే ఆదినారాయణను రాజోలి, హుస్సేన్ నిలదీశారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోని కొందరు వ్యక్తులు తనపై దాడి చేశార ని, పైగా తనతోపాటు కుటుంబసభ్యులను అక్రమకేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఏఎస్సై పాపయ్య వారిని అడ్డుకోగా.. బాధితులు ఆయనపై సైతం విరుచుకుపడ్డారు.