నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9: కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల సబ్స్టేషన్లను ముట్టడించారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో యూరియా, కరెంట్ సమస్యలపై ప్రధాన రహదారిపై బైఠాయించారు. వ్యవసాయాధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను ముట్టించడంతోపాటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో సొసైటీ ఆధ్వర్యంలో యూరియా సకాలంలో అందించడం లేదని రైతులు కార్యాలయానికి తాళం వేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ 6 గంటలు కూడా సరిగా ఇవ్వడంలేదని రైతులు మండిపడ్డారు. విద్యుత్తు సరిగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన చెందారు. ట్రాన్స్‌కో ఏఈ దామోదర్ వచ్చి రైతులకు నచ్చజెప్పారు. ఇబ్రహీంపట్నం మండలం కోజన్‌కొత్తూర్, కేశాపూర్ గ్రామాల రైతులు ఇబ్రహీంపట్నం సబ్‌స్టేషన్ ముట్టడించారు. నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని కోరుతూ ఏఈ సతీశ్‌కు వినతిపత్రం అందజేశారు. కోరుట్ల మున్సిపాలిటీలో విలీనమైన ఎఖీన్‌పూర్‌లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యుత్తు కోతలను నిరసిస్తూ రహదారిపై బైఠాయించారు. వ్యవసాయానికి 8 గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల, ఎలికట్ట గ్రామాలకు చెందిన రైతులు బుధవారం కల్వకుర్తి ఏడీఈ కార్యాలయాన్ని మట్టడించారు.
కరెంట్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం 15 గంటల కరెంటైనా ఇవ్వాలని ఏడీఈని నిలదీశారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నె రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కరెంట్ కోతలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. లింగంపేట, పాల్వంచ మండలాల్లో ధర్నాకు దిగారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంట రైతులు బుధవారం రాజాపేటలో రాస్తారోకో నిర్వహించారు. రోజుకు కేవలం ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతున్నదని ఆవేదన చెందారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్తు సమస్య కారణంగా నష్టపోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లపల్లిలోని సబ్‌స్టేషన్ ఎదుట ప్రధాన రోడ్డుపై చాట్లపల్లి, తీగుల్‌నర్సాపూర్, అంతాయగూడెం రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.