రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నరట! ఇదీ అరికట్టాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ మాట. కొరత.. కొరత.. అని అంటుంటేనే కొరత ఏర్పడుతున్నదని అంటున్నడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. రైతులు పొలాల్లో ఉండాలి.. బజార్లో ఎందుకున్నారని అంటున్నడు యూరియా ఇయ్యలేక రైతన్నను రోడ్డుమీద నిలబెట్టిన వ్యవసాయ మంత్రి తుమ్మల. కొరత లేదు, పత్రికలే సృష్టిస్తున్నయని మంత్రి పొన్నం అంటుంటే.. కొరత ఉన్నదని, కేంద్రం ఇస్తలేదని మంత్రి పొంగులేటి అంటున్నడు.
బస్తా యూరియా ఇప్పించలేక.. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ కాలం గడిపేస్తున్నయ్. కొరత ఉన్నదని ఒప్పుకోరు! లేదని ఇప్పించలేరు! ఇదంతా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కలిసి ఆడుతున్న దాగుడుమూతలు! అటు బీజేపీ, ఇటు కాంగ్రె స్ కలిసి చేస్తున్న రాజకీయ క్రూర పరిహాసం.
కృత్రిమ కొరత సృష్టిస్తున్నదెవరో తేల్చాల్సింది ఎవరు? చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? బ్లాక్ మార్కెట్‌కు పోతున్నదని బీఆర్ఎస్ కూడా చెప్తున్నది కదా. అధికారంలో ఉండీ ఆపలేక.. ఎందుకీ డొల్లమాటలు?
కొందరు కావాలనే ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నరు. యూరియా దొరకట్లేదని భయపెట్టడంతో రైతులు తెల్లారంగనే లైన్ కడుతున్నరు.
-సీఎం రేవంత్
సాగు పనుల్లో ఉండాల్సిన రైతుని బజారుకు లాగిందెవరు? బస్తా యూరియా కోసం పడిగాపులు పడేలా చేసిందెవరు? అసలు యూరియానే ఇయ్యకపోతే పొలానికి పోయి రైతు చేసేదేంది?
యూరియా కొరత దేశమంతా ఉన్నది. నిజమైన రైతులు పొలంలో ఉన్నరు. బస్తాల కోసం బజార్లోకి వస్తున్నవాళ్ల్లు రైతులు కారు.
– వ్యవసాయ మంత్రి తుమ్మల
సరిపడా యూరియా ఇస్తే.. ఇచ్చింది ఏమైందో తేల్చాలి కదా? ‘కొరత..కొరత’ అంటేనే ఎరువులకు కొరత ఏర్పడితే.. మరి ‘తెస్తాం.. తీరుస్తాం’ అంటే సమస్య పరిష్కారమైతదా?
రాష్ట్రం వద్ద సరిపడా యూరియా స్టాక్ పెట్టినం. ఏమైందో తెల్వదు. కొరత.. కొరత.. అంటూ మాట్లాడటం వల్లే కొరత ఏర్పడుతున్నది.
– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఏ ఊరికి పోయినా యూరియా కరువు కనిపిస్తున్నది. అగచాట్ల ఫొటోలు, రైతుల శాపనార్థాలు అన్నీ అబద్ధమా? రైతు గోసను పట్టించుకోకుండా పత్రికలపై నెపం నెట్టేస్తే ఎలా?
నమస్తే తెలంగాణ, టీ-న్యూస్ పదే పదే వార్తలు ప్రసారం చేయడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత కనిపిస్తున్నది.
-మంత్రి పొన్నం ప్రభాకర్
అడిగినంతా యూరియా ఇచ్చామని కేంద్రం అంటున్నది. ఇవ్వలేదని మీరంటున్నరు. మీరు సరిగ్గా అడగలేదా? అడిగినా వాళ్లివ్వలేదా? ఎవరివి డ్రామాలు! ఏమిటీ దాగుడుమూతలు?
యూరియా కరువుకు బాధ్యత కేంద్రానిదే! రాష్ర్టానికి సరిపడా యూరియా సరఫరా చేయాలి. పరిస్థితిని రోజుకు రెండుసార్లు సమీక్షిస్తున్నం
-మంత్రి పొంగులేటి
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 21 : తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పోరుబాట పట్టారు. యూరియా ఎందుకు ఇవ్వడంలేదంటూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు.
యూరియా కొరత తీర్చలేకపోతున్న సర్కారు తీరును నిరసిస్తూ గురువారం చండూర్ చౌరస్తాలో రైతులతో కలిసి ధర్నా చేస్తున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో పీఏసీఎస్ వద్ద యూరియా కోసం గంటల కొద్ది రైతులు బారులు తీరారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామపంచాయతీ ఎదుట రహదారిపై అన్నదాతలు ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించాలని, యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్‌పల్లి వంతెన, సుందిళ్ల బరాజ్ చెక్ పోస్టుల వద్ద ఇతర జిల్లాలకు తరలిస్తున్న 20 బస్తాల యూరియా, 20 బస్తాల 20-20 ఎరువులను అధికారులు పట్టుకున్నారు.
మహబూబ్‌నగర్ ఎరువుల విక్రయ కేంద్రం వద్ద బారులుదీరిన రైతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌కు పది రోజుల క్రితం 300 బ్యాగులు రావడంతో ఆ గ్రామానికి గతంలో అనుబంధంగా ఉండి, ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన పోతిరెడ్డిపల్లి గ్రామస్థులకు యూరియా బస్తాలు ఇచ్చేది లేదని వెంకటాపూర్ రైతులు నిరాకరించారు. రైతుల మధ్య కొంత ఘర్షణ చోటుచేసుకోగా, అందులో కొందరికి మాత్రమే యూరియా బస్తాలు అందాయి. ఇటీవల తిమ్మాపూర్‌కు యూరియా బస్తాలు రావడంతో బొప్పాపూర్‌కు చెందిన కొందరు రైతులు అక్కడకు చేరుకోవడంతో తిమ్మాపూర్ రైతులు తమ గ్రామానికి ఇచ్చిన తర్వాతే ఇతర గ్రామాల వారికివ్వాలని చెప్పడంతో ఆవేదనతో వెనుదిరిగారు.
బొప్పాపూర్‌కు 460 బస్తాల లోడు రాగా అందులో 240 బస్తాలు దింపి వెళ్దామనుకునే క్రమంలో రైతులు లారీని అడ్డగించి, తమను ఇతర గ్రామాల రైతులు రానివ్వడంలేదని, మొత్తం లోడు గ్రామంలోనే దించాలని పట్టుబట్టారు. అధికారులు స్పందించి రైతులను శాంతింపజేసి, లారీని అక్కడ నుంచి పంపించారు. పదిర గ్రామానికి యూరియా బస్తాలు వచ్చాయని పక్క గ్రామమైన హరిదాస్‌నగర్ రైతులు రావడంతో ముందుగా తమ గ్రామ రైతులకు ఇవ్వాలని చెప్పడంతో హరిదాస్‌నగర్ రైతులు ఇబ్బంది పడ్డారు. పదిర రైతులకు రెండు బస్తాల చొప్పున ఇచ్చిన తర్వాత మిగిలిన కొన్ని బస్తాలు హరిదాస్‌నగర్ ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అజ్మీరా బిచ్చానాయక్ గూడూరులో లైన్లో నిలబడ్డాయూరియా దొరకలేదు. చింతపల్లిలోని ఓ ప్రైవేట్ దుకాణంలో యూరియా కోసం బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో ఈదులపూసపల్లి సమీపంలో ద్విచక్రవాహనంపై నుంచి కిందపడటంతో అతడి పక్కటెముకలకు తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మూడు రోజులుగా యూరియా దొరకడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి, రాకపోకలను అడ్డుకున్నారు. నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో గంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు చేరుకొని మధ్యాహ్నం వరకు యూరియా అందుబాటులోకి వస్తుందని నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. రైతు వేదికలో టోకెన్ తీసుకొని పీఏసీఎస్ వద్దకు పరుగులు తీశారు. ఒక్కొక్కరికి ఒక సంచి మాత్రమే యూరియా అందడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో యూరియా కోసం ఓ రైతు నెత్తురు చిందించాల్సి వచ్చింది. యూరియా లోడ్ వచ్చిందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు మరిపెడ చేరుకున్నారు. ఆగ్రోస్ కేంద్రం మూసి ఉండడంతో గాంధీసెంటర్‌లో గంటపాటు ధర్నా చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎరువుల విక్రయ కేంద్రం వద్ద క్యూలో గంటల తరబడి నిలబడటంతో నీరసించి కళ్లు తిరగడంతో కింద కూర్చున్న మహిళా రైతు
దీంతో రైతులు ఆందోళన విరమించి, ఆగ్రోస్ కేంద్రంను తెరిపించి.. క్యూ కట్టారు. చాలాసేపు లైన్లో నిల్చున్న మల్లమ్మకుంట తండాకు చెందిన వృద్ధుడు అజ్మీరా లక్కు మెట్లపై నుంచి కింద పడిపోవడంతో అతడి తలకు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడిలో మాజీ మంత్రి జోగు రామన్నకు రోదిస్తూ పంట నష్టపోయినట్టు చెబుతున్న రైతు లచ్చన్న
లక్కును పోలీసులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. లక్కుకు గతంలో పక్షవాతం వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పంటను కాపాడుకునేందుకు యూరియా బస్తా దక్కించుకోవాలనే ఆరాటంతో లక్కు కూడా క్యూలో నిల్చోవాల్సి వచ్చిందని ఆవేదనతో చెప్పారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న రైతులు
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలోని కొత్తపల్లి సహకార సంఘంలో బడికి వెళ్లే తన ఏడేండ్ల కుమారుడిని తీసుకొచ్చి ఓ రైతు క్యూలో నిలబెట్టారు. కొందరు కూలీలను తీసుకువచ్చి రోజుకు రూ.50 చొప్పున చెల్లించి లైన్లో నిలబెడుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట సింగిల్‌విండో కార్యాలయం వద్ద యూరియా కోసం బారులుదీరిన రైతులు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పీఏసీఎస్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో యూరియా కోసం ఖమ్మం-వరంగల్ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు