శాయంపేట/వీణవంక/పెగడపల్లి/సైదాపూర్/ఇల్లెందు, ఆగస్టు 6: యూరియా కోసం రైతుల అవస్థలు పడుతున్నారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసు పహారా మధ్య పంపిణీ చేస్తున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో పోలీసు పహారా మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు. మార్కెట్ గోదాముకు బుధవారం 20 టన్నుల యూరియా రాగా కొప్పుల, పత్తిపాక, వసంతాపూర్ రైతులు భారీగా తరలివచ్చారు. తోపులాట జరగడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. టన్నుల కొద్దీ యూరియా బస్తాలు వచ్చినా రైతులు ఎండలో గంటల తరబడి నిలబడి బస్తాలను తీసుకెళ్తుండటం గమనార్హం.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లోని సొసైటీ గోదాంకు 450 యూరియా బస్తాల లోడ్ రాగా, దాదాపు 300 మంది రైతులు వచ్చారు. పోలీస్ పహారా మధ్య రైతులకు యూరియా పంపిణీ చేశారు. సైదాపూర్ మండలంలోనూ రైతులు ఎరువుల కోసం నిరీక్షించారు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, కారేపల్లి మండలాల్లో వరి, మక్క రైతులకు యూరియా అందరికీ సరిపోదని సగం మందిని వెనక్కి పంపించారు. పెద్దపల్లి జిల్లా ఎక్లాస్‌పూర్‌లో 8గంటల నుంచే బారులు తీరి, చెప్పులను క్యూలో ఉంచారు.