కొడంగల్, అక్టోబర్ 23: భూసేకరణ జరిపి ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యకంచేశారు. పలుమార్లు వికారాబాద్, తాండూర్ పట్టణాలను వెళ్లి కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన పారిశ్రామికవాడ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఇందులో భాగంగా మరికొందరు భూమిని అందించాల్సి ఉండగా గురువారం దుద్యాల మండలం లగచర్ల గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారులు రైతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో భూమిని అందించిన రైతులు తమ ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 8 నెలలు కావస్తున్న నష్టపరిహారాన్ని అందుకోలేదని పేర్కొన్నారు.
వెళ్లిన ప్రతీసారి రూ.1000కిపైగా ఖర్చుపెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.50 వేల వరకు ఖర్చు చేశామని తెలిపారు. 8 నెలలైనా పరిహారం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. అధికారులు తమ ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే పరిహారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ రైతులతో మాట్లాడి అభిప్రాయ సేకరణతోపాటు భూ సేకరణపై అవగాహన కల్పించారు. కాగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తండాలతోపాటు లగచర్ల గ్రామ చుట్టుపక్కల గ్రామాల వారికి అధికారులు సమాచారాన్ని అందించకపోవడంతో రైతులు సమావేశానికి హాజరు కాలేకపోయినట్టు పలువురు పేర్కొన్నారు.