‘ఫిబ్రవరిలోనే ఎండలు ముదిరిపోతున్నాయి. రైతులు వరి సాగు చేయవద్దు. నీళ్లుంటేనే పంటలు వేసుకోవాలి. నీళ్లు లేనప్పుడు వరి వేయడం వలన ప్రయోజనం లేదు. పంటలపై పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోవద్దు. బోర్లు వేసి అప్పుల పాలు కావొద్దు.’
– శుక్రవారం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన ప్రకటన
Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దూకగా.. ప్రాజెక్టులు ఏడాది పొడవునా నిండుకుండలా తొణకిసలాడుతూ.. తెలంగాణలో సిరుల ‘పంట’ పండించాయి. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో రిజర్వాయర్లు నిండటం, మరోవైపు మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగి తెలంగాణ ‘జలమాగాణం’గా పరిఢవిల్లింది. రైతును రారాజును చేయడమే లక్ష్యంగా సాగిన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఏనాడూ చూడని భూగర్భ శోకం ఇప్పుడు రాష్ట్రంలో దాపురించింది. కేవలం 14 నెలల కాంగ్రెస్ పాలనలో చేపట్టిన తిరోగమన చర్యలతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకున్నది.
పల్లెల్లో భూములు నెర్రెలు బారుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ప్రణాళిక లేమితో వనరులు ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేకపోవడం రైతాంగం పాలిట శాపంలా మారింది. వరిపంట వేయొద్దని ఏకంగా రైతు కమిషన్ ప్రకటించే దుస్థితికి రాష్ట్రం చేరుకుంది. ఫిబ్రవరి నెల కూడా ఇంకా ముగిసిపోలేదు రాష్ట్రంలో అప్పుడే భూగర్భ జలాలు అడుగంటడం ప్రారంభమైంది. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నది. కేసీఆర్ హయాంలో రైతులకు ఏడాది పొడవునా సాగుకు నీరు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించి అమలుపర్చగా.. కాంగ్రెస్ 14 నెలలుగా మీనామేషాలు లెక్కిస్తూ సాగునీరు అందించడంలో చేతులెత్తేసింది.
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పొందుపర్చిన రిపోర్టు ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత ఏరియాలో 2020లో భూగర్భ జలాల లభ్యత 125.5 టీఎంసీలు ఉండగా.. కేసీఆర్ అమలు చేసిన సాగు ప్రణాళికతో 2022 నాటికి భూగర్భ జలాల లభ్యత 160.5 టీఎంసీలకు చేరింది. ఇదే ఏరియాలో మిషన్ కాకతీయ ద్వారా 2020లో భూగర్భ జలాల నీటి లభ్యత 10.8 టీఎంసీలుగా ఉండగా, 2022 నాటికి 12.4 టీఎంసీలకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా నిరంతరం చెరువులు, చెక్ డ్యామ్‌ల్లో నీటి లభ్యత కారణంగా ఉపరితల నీటి వినియోగం పెరిగింది.
తద్వారా భూగర్భ జలాల వినియోగం భారీగా తగ్గింది. దీంతో 2020లో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను 64 శాతం వినియోగించుకుంటే 2022 నాటికి అది ఏకంగా 55 శాతానికి తగ్గింది. అదే మిషన్ కాకతీయ పనులు చేపట్టిన ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం 77 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది. మిగతా ప్రాజెక్టుల కింద ఉన్న ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొన్నది. భూగర్భ జలాల వినియోగం తగ్గితే వచ్చే సీజన్లో అయినా వాటిని వినియోగించుకోవడంతో పాటు కరెంటు వినియోగం సైతం తగ్గుతుంది. కేసీఆర్ సాగు వ్యూహంతో ఉపరితల నీటి వినియోగం పెరిగి గ్రౌండ్ వాటర్ వినియోగం తగ్గుతూ వచ్చింది. తద్వారా గ్రౌండ్ వాటర్ ఏటికేడు పెరుగుతూ వచ్చింది.
నీటి లభ్యత పెంచి రైతుల సాగు అవసరా లు తీర్చడంలో భాగంగా కేసీఆర్ సర్కారు చెక్ డ్యామ్‌లను భారీగా నిర్మించింది. దీంతో భూ గర్భ జలాలు మరింతగా పెరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసా య రంగంలో సమగ్ర ప్రణాళిక వేయడంలో విఫలమైంది. ఏడాది కాలంలోనే పంట వేయొ ద్దు అనే దుస్థితికి కాంగ్రెస్ పాలన దిగజారింది. రాష్ట్రంలో నీటి వనరులున్నా.. కేవలం కేసీఆర్‌పై కక్షతో రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు తీరని ద్రోహం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించకుండా కుంగిన పిల్లర్ల సాకుతో పక్కన బెట్టిన ఫలితంగా ఈ దుస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసుకొని చెరువులను, రిజర్వాయర్లను నింపాలని రాష్ట్ర రైతాంగం కోరుతున్నది.
రాజాపేట, ఫిబ్రవరి 22 : ‘చెరువులన్నీ ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి పోయి బోర్లు, బావులు ఒట్టిపోయాయి. నీళ్లు లేక సాగు చేసిన వరి పంట పొట్ట దశలో కండ్లముందే ఎండిపోతుంది. సీఎం సారూ.. మా తలాపు నుంచే కాళేశ్వరం నీళ్లు పుష్కలంగా పారుతున్నాయి. ఆ నీళ్లను మా వైపు మళ్లించి గొలుసుకట్టు చెరువులు నింపి సాగు జలాలు అందించి కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోండి.’ అంటూ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన రైతు నాగపూరి పుల్లయ్య మండల కేంద్రంలోని పొట్టిమర్రి వాగులో పడుకొని నిరసన తెలిపాడు.