ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ కార్యాలయం వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే రైతులు బారులుతీరారు. యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో రైతులు పాత పద్ధతుల్లోనే సొసైటీల వద్ద క్యూ కట్టి నానా అవస్థలు పడ్డారు.
– వైరా టౌన్(కొణిజర్ల)
రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యాసంగి పనులు ముమ్మరం కావడంతో ఎముకలు కొరికే చలిలో యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. పీఏసీఎస్ గోదాముల వద్దకు బుధవారం తెల్లవారుజామునే చేరుకున్న రైతులు.. అధికారులు వచ్చే వరకు గంటలకొద్దీ బారులుతీరారు. చాలాచోట్ల యూరియా అందక సగం మంది నిరాశతో వెనుదిరిగారు. యాప్ తీసుకొచ్చామని సర్కార్ చెప్తున్నా అది సక్రమంగా పనిచేయకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు ఎందరో యూరియా కోసం తండ్లాడుతున్నారు.
– నమస్తే న్యూస్‌నెట్‌వర్క్

మహబూబాబాద్ జిల్లా పెనుగొండకు 444 బస్తాల యూరియా బస్తాలు రాగా ఒక్కో రైతుకు బస్తా చొప్పున పంపిణీ చేశారు. సగం మందికి కూడా సరిపోలేదు. మిగతా వారికి లోడ్ వచ్చిన తరువాత ఇస్తామని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.
– కేసముద్రం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లి పీఏసీఎస్ గోదాంకు బుధవారం తెల్లవారుజామున యూరియా లారీ రావడంతో వందలాది మంది రైతులు తరలివచ్చారు. ఉదయం 8.30 గంటల తర్వాత అధికారులు వచ్చి పోలీస్ పహారా మధ్య ఒక్కో బస్తా పంపిణీ చేశారు.
– నర్సంపేట

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. పోలీసులు వచ్చి రైతులను వరుస క్రమంలో నిలబెట్టి పంపిణీ చేశారు. ఒకటి, రెండు బస్తాల కంటే ఎక్కువ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
– ధర్మసాగర్

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు నుంచి మహబూబాబాద్ వైపు యూరియా బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా చిన్ననెమిలి నుంచి ట్రాక్టర్లో 68 బస్తాల లోడ్‌ను పిట్టల మహేందర్ అనే వ్యక్తి మహబూబాబాద్ తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.
– చిన్నగూడూరు

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ సొసైటీ గోదాం వద్ద తెల్లవారకముందే రైతులు అక్కడికి చేరుకొని చెప్పులు క్యూలో పెట్టారు.
– భిక్కనూరు

కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద దాదాపు 200 మంది రైతు బారులుతీరారు. యాప్ మొరాయిస్తుందంటూ గంటల తరబడి క్యూలో ఉండి అవస్థలు పడ్డారు. వచ్చిన రైతులందరికీ ఒక్కో బస్తా చొప్పున అందజేశారు.
– కరీంనగర్ రూరల్

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి బుధవారం 1,100 బస్తాల యూరియా రావడంతో వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తోపులాట జరిగింది. యూరియా దొరక్క పోవడంతో సర్కార్‌పై దుమ్మెత్తిపోశారు.
– నర్సింహులపేట

హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని పీఏసీఎస్ వద్ద రెండో రోజూ యూరియా కోసం రైతులది అదే పరిస్థితి. 2వేల బస్తాలు రావడంతో భారీ సంఖ్యలో క్యూకట్టారు. యాప్‌లో నమోదు చేసేందుకు సైట్ మొరాయించడంతో ఆధార్ కార్డు నంబర్ నమోదు చేసి ఇచ్చారు.
– కమలాపూర్