ఏం జరిగింది: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రైతులు బుధవారం ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులుకాసిన రైతులు ఓపిక నశించి ధర్నాకు దిగారు. గజ్వేల్‌లోని తూఫ్రాన్-జాలిగామ బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయాధికారులు బాబూనాయక్, నాగరాజు ధర్నా వద్దకు చేరుకుని యూరియా రాగానే ప్రతి రైతుకు రెండు బస్తాలు ఇస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.
-సిద్దిపేట జిల్లా గజ్వేల్
ఏం జరిగింది: యూరియా కోసం నిద్రాహారాలు మాని ఎరువుల కోసం రైతులు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ నిరాశే ఎదురవుతున్నది. నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ఉదయం 7 గంటలకు రైతులు రోడ్డుపై బైఠాయించారు.
-నల్లగొండలోని దేవరకొండ రోడ్డు ఆగ్రోస్ సేవా కేంద్రం
ఏం జరిగింది: యూరియా కోసం అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా యూరియా లభించకపోవడంతో విసుగెత్తిన అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
-మెదక్ జిల్లా మక్కరాజిపేటలో
ఏం జరిగింది: ఆగ్రోస్, పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా వస్తుందని అధికారులు ప్రకటించడంతో బుధవారం చుట్టు పక్క గ్రామాల నుంచి రైతులు భారీ సంఖ్యలో దుబ్బాకకు తరలి వచ్చారు. యూరియా రావడం లేదన్న విషయం తెలిసి సిద్దిపేట రోడ్డుపై ధర్నాకు దిగారు.
-సిద్దిపేట జిల్లా దుబ్బాక
ఏం జరిగింది: యూరియా కోసం రెండు రోజులుగా లైన్లో నిల్చుని పడిగాపులు కాస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సిద్దిపేట కామారెడ్డి రహదారిపై రాఘవాపూర్ వద్ద అన్నదాతలు రాస్తారోకోకు దిగారు.
-సిద్దిపేట జిల్లా కామారెడ్డి రహదారిపై
ఏం జరిగింది : వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీసీఎస్ వద్దకు బుధవారం ఉదయమే రైతులు చేరుకొని క్యూ కట్టారు.. కొందరు ఇటుక పెల్లలను, చెప్పులను లైన్లో ఉంచారు.. ఇంకొందరు చెప్పుల పక్కనే నిద్రపోయారు. సాయంత్రం 4 గంటలకు యూరియా లోడ్ రావడంతో ఒక్కసారిగా కర్షకులు ఎగబడ్డారు.
-వనపర్తి జిల్లా ఆత్మకూరు
ఏం జరిగింది: రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం వద్దకు యూరియా రావడంతో పోలీసుల ఆధ్వర్యంలో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున అందించారు.
-మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట
ఏం జరిగింది: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆగ్రోస్, పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా వస్తుందని అధికారులు ప్రకటించడంతో భారీగా రైతులు తరలివచ్చారు. వేకువజామునే చేరుకుని పడిగాపులుకాశారు. చివరకు యూరియా రావడం లేదనడంతో ఆగ్రహించిన రైతులు దుబ్బాకలోని శివాజీ విగ్రహం చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.
-సిద్దిపేట జిల్లా దుబ్బాక
ఏం జరిగింది : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు పీఏసీసీఎస్ వద్దకు బుధవారం చేరుకున్న రైతులు పట్టాపాస్‌బుక్కులు, ఆధార్ జిరాక్స్ కాపీలను వరుసగా ఉంచారు. యూరియా రావడానికి ఇంకా రెండ్రోజులు పడుతుందని సిబ్బంది చెప్పడంతో నిరాశ చెందారు. అక్కడే గోడపై గట్టు, గొర్లఖాన్‌దొడ్డి ఆగ్రోస్ కేంద్రాల్లో యూరియా లభిస్తుందని కాగితంపై రాసి ఉండటాన్ని గమనించిన కర్షకులు అక్కడకు వెళ్లగా 600 బస్తాల యూరియాను పంపిణీ చేశారు.
-జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు
ఏం జరిగింది : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పీఏసీసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. యూరియా అందించకపోవడంతో ఆగ్రహంతో ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. కేటీదొడ్డి మండలం పాతపాలెం పీఏసీసీఎస్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నియోజకవర్గ నేత బాసు హనుమంతు నాయుడు రైతులకు మద్దతు తెలిపారు.
-జోగుళాంబ గద్వాల
ఏం జరిగింది: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల రైతులు పెద్ద సంఖ్యలో గుమిగుడారు. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులతో క్యూ కట్టించారు.
-సిద్దిపేట జిల్లా అక్కన్నపేట
ఏం జరిగింది: నల్లగొండ జిల్లా తిప్పర్తి పీఏసీఎస్ వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచి రైతులు పడిగాపులు కాశారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తానే ఇవ్వడంతో వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. మండల వ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు గాను 2333 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు కేవలం 1675మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
-నల్లగొండ జిల్లా తిప్పర్తి
ఏం జరిగింది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లి ప్రాథమిక వ్వవసాయ సహకార సంఘం సెంటర్‌కు యూరియా లోడ్ వచ్చందనే సమాచారం అందుకున్న రైతులు ఉదయం 4 గంటల నుంచే క్యూ కట్టారు. రైతుల మధ్య తోపులాట జరిగి లూనావత్ కిషన్ నాయక్ కాలుకు గాయాలయ్యాయి.
-వరంగల్ జిల్లా నల్లబెల్లి
ఏం జరిగింది : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట విజయలక్ష్మి గ్రామైక్య సంఘం ఫర్టిలైజర్ షాపునకు లోడ్ వస్తుందని తెలిసి బుధవారం ఉదయమే రైతులు తరలివచ్చారు. గంట సేపు నిరీక్షించినా లారీ రాకపోవడంతో ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. తహసీల్దార్ మారుతీరెడ్డి చేరుకొని యూరియా కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి, మళ్లీ క్యూ కట్టారు.
-రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట
ఏం జరిగింది : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి సొసైటీ వద్ద బుధవారం రైతులు ఉదయం 6 గంటల నుంచే క్యూ కట్టారు. పంపిణీకి 444 బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండగా వేయిమందికి పైగా రైతులు వచ్చారు. దీంతో అధికారులు ఒక్క రైతుకు ఒక్క బస్తా మాత్రమే పంపిణీ చేశారు.
-వరంగల్ జిల్లా నెక్కొండ
ఏం జరిగింది : వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట, మనుబోతులగడ్డ పరిధిలోని సొసైటీ ఎరువుల గోదాంలకు యూరియా రావడంతో రైతులు తెల్లవారుజామున 3 గంటల నుంచే బారులు తీరారు. రైతువేదిక వద్ద ఉదయం నుంచి వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇస్తుండడంతో పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. సొసైటీకి 444 బస్తాల యూరియా మాత్రమే రావడంతో కొద్ది మందికే టోకెన్లు జారీ చేశారు. గంటల తరబడి క్యూలో నిల్చోవడంతో రైతు అల్లీపాషా సొమ్మసిల్లి పడిపోయాడు.
-వరంగల్ జిల్లా ఖానాపురం