Nalgonda | తిరుమలగిరి, ఆగస్టు 30: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఒకనాటి కరువు ప్రాంతం తిరుమలగిరి.. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో జవసత్వాలు నింపుకొని సస్యశ్యామలైంది. నీటి చెమ్మ లేనిచోట పరవళ్లు తొక్కిన గోదావరి జలాలు అన్నదాత ఇంట సిరుల పంట పండించాయి. కానీ ఆ సంతోషం రైతాంగంలో ఎన్నో ఏండ్లు నిలువలేదు. కాంగ్రెస్ పాలన మళ్లీ పాతకాలాన్ని గుర్తుచేస్తూ కరువు కోరల్లోకి నెడుతున్నది. రేవంత్రెడ్డి సర్కారులో గోదావరి జలాల జాడలేక వానకాలంలోనూ వరి పైర్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క భారీ వర్షం పడలేదు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ప్రభుత్వం చెరువులు, కుంటలను నింపకపోవడంతో నీళ్లులేక వెలవెలబోతున్నాయి. వాగులు, వంకలు వట్టిపోయాయి. బిక్కేరు వాగులోనూ నీరు కనిపించడం లేదు. బోర్లు, బావుల ఆధారంగా కొద్దొగోప్పో వేసిన వరి పైర్లు ఎండిపోతున్నాయి. సాగు సిద్ధంగా వేసిన నారుమడుల్లో నారు ముదిరిపోతున్నది. గతంలో 30 ఫీట్ల లోతులో ఉన్న భూగర్భజలాలు ప్రస్తుతం 200 ఫీట్లకు అడుగంటాయి. గోదావరి జలాలు వస్తే 165 గ్రామాలకు నీరు అందించే 69, 70, 71 డీబీఎంల పరిధిలో వరి పైర్లు ఎండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తిరుమలగిరి మండలంలో ఆగస్టు నెలాఖరు వరకు 20 వేల ఎకరాలకుపైగా వరి సాగయ్యేది. ప్రస్తుతం 10 వేల ఎకరాలు కూడా మించలేదు. మూడు వారాల నుంచి వర్షాల్లేకపోవడం, ఎండలు దంచి కొడుతుండడంతో పత్తి, కంది, వేరుశనగ పంటలు వాడిపోతున్నాయి. పత్తి పూత దశకు వచ్చే సమయంలో కాలం కలిసిరాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇంకో వారం రోజులు వర్షాలు పడకుండా, ఎండలు ఇలా కొడితే పత్తి పూత, గూడ రాలి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.
తుంగతుర్తి నియోజకవర్గానికి ఎస్పారెస్పీ రెండో దశ కాల్వల ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 యాసంగిలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత వర్షాకాలంలోనూ సాగునీటి విడుదలలో స్పష్టత లేకుండా పోయింది. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ ద్వారా నీటి విడుదల ఆలస్యం జరుగుతుండడంతో కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి నీళ్లు చేరతాయా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ టైమ్లో మాకు నీళ్లకు ఢోకా లేకుండే. కాల్వ నీళ్లతోని చెరువులు, కుంటలు నింపడంతో బోర్లు పుష్కలంగా పోశాయి. వర్షాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసుకునేవాళ్లం. ఇప్పుడు నీళ్లు లేక సాగు చేయాలంటేనే భయమైతున్నది.
రెండెకరాలు వరి నాటుపెట్టిన. నీళ్లు ఇస్తే మరో 2 ఎకరాల వరకు సాగు చేద్దామని నారు పోసిన. వేసిన పంట, పోసిన నారు ఎం డుతున్నది. ఎస్సారెస్పీ కాల్వల్లో నీరు వస్తే భూగర్బ జలాలు పెరిగి బోర్లు నిండుగా నీరు పోస్తయి. బోర్లు ఆగి పోస్తున్నయ్.