
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): బియ్యం ఎందుకు కొనరు? రైతులకు అన్యాయం ఎందుకు చేస్తరు? మట్టి పిసుక్కొని బతికే హాలికుడిపై హత్యాయత్నమా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఉద్యమాన్ని లేవనెత్తింది. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ద్విముఖ వ్యూహంతో పోరాటాన్ని మొదలుపెట్టింది. ఒకవైపు రాష్ట్ర మంత్రులు, ఎంపీలను ఢిల్లీకి పంపించి కేంద్ర ఆహారశాఖ మంత్రి, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తేవడంతోపాటు, ఇటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సోమవారం అటు ఢిల్లీలో, ఇటు గల్లీలో ఒకేసారి టీఆర్ఎస్ తన కార్యాచరణను అమలు చేయనున్నది. బియ్యం సేకరణలో మోదీ సర్కారు అవలంబిస్తున్న విధానాలపై ఊరూరా నిరసనలు చేపట్టేందుకు గులాబీ శ్రేణులు సై అంటున్నాయి. చావు డప్పు, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామంలోని ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాడవాడలా చావు డప్పు కొడుతూ, నల్లా జెండాలు ప్రదర్శిస్తూ, నిరసన ర్యాలీలు చేపడుతూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు.
గల్లీలోని నిరసన ఢిల్లీకి వినిపించేలా, కేంద్రం కండ్లు తెరిపించేలా కార్యక్రమాలను చేపట్టనున్నారు. రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కన్ను కుట్టింది. సంతోషంగా ఉన్న రైతుల పట్ల కండ్ల మంటను బయటపెట్టుకొన్నది. వానకాలం కొనుగోళ్లపై అయోమయానికి గురిచేస్తూ, యాసంగి బియ్యం కొనబోమని గందరగోళం సృష్టిస్తున్న కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతల తీరుకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా చావు డప్పు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం పిలుపు మేరకు మంత్రి కేటీఆర్ సహా ఇతర మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, రైతుబంధు అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్త నిరసనల్లో పాల్గొనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే నిరసనల్లో పాల్గొంటారు.

టీఆర్ఎస్ ధర్నాలకు లారీ ఓనర్స్ మద్దతు
టీఆర్ఎస్ ధర్నాలకు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అసోసియేషన్ నేతలు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎఫ్‌సీఐ ధాన్యాన్ని కొనకపోవటం వల్ల లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతారని, వేలాది మంది ఉపాధి కోల్పోతారని తెలిపారు. కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. తీర్మాన పత్రం అందజేసినవారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ఎస్కే చాంద్‌పాషా, ఉపాధ్యక్షుడు రామినేని శ్రీనివాసరావు, ఎండీ సలావుద్దీన్, జాయింట్ సెక్రటరీ, కొయ్యాడ సుధాకర్‌గౌడ్, కోశాధికారి వేముల భూపాల్ తదితరులు ఉన్నారు.
నిరసనల్లో రైతుబంధు సమితి: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనబోమన్న కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు, రైతు బంధు సమితి సభ్యులు ధర్నాలో పాల్గొనాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతుబంధు సమితి గ్రామ, మండల, జిల్లాల సభ్యులు, అధ్యక్షులు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని సూచించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్లో నిరసనలో తాను పాల్గొంటానని పేర్కొన్నారు.