మాడ్గులపల్లి, జూన్ 9: నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గండ్రవానిగూడెం ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతను నిరసిస్తూ మంగళవారం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని కుకడం వద్ద నారట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కేంద్రానికి వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు. వర్షం వస్తే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు హైవేపై బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధాన్యం రంగు మారిందని అన్లోడింగ్కు నిరాకరిస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామని పలువురు రైతులు పెట్రోల్ డబ్బాలతో తహసీల్దార్ ఎదుట నిరసనకు దిగారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారంలో మంగళవారం చోటుచేసుకున్నది. మే 27న పలువురు రైతుల ధాన్యాన్ని తూకం వేసి గోదాముకు తరలించారు. రెండ్రోజుల క్రితం అన్లోడింగ్ చేసేటప్పుడు 40 బస్తాలు దించిన తరువాత రంగు మారిందంటూ నిరాకరించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.
– కొల్చారం
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్లో కంగ్టి-పిట్లం రోడ్డుపై జొన్న రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. గన్నీ సంచుల కొరత, లారీలు రాకపోవడంతో తూకంలో జాప్యం జరుగుతున్నదని, ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జొన్నలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమను పక్కనపెట్టి దళారుల జొన్నలు త్వరితగతిన తూకం చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
-కంగ్టి