మంచిగా పంటలు పండుతున్న తమ భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలని దేవుడిని కోరుతూ భూబాధితులు గ్రామ దేవతలకు పూజలు చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్‌లో ఫార్మాసిటీ భూబాధితులు, గ్రామస్థులు కలిసి భాజాభజంత్రీల మధ్య ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. కులమతాల కతీతంగా భూబాధితుల కుటుంబ సభ్యులు గ్రామ దేవతల ఆలయాలు, చర్చిలు, మసీదులు, దర్గాల్లో పూజలు, ప్రార్థనలు చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే తమ బతుకులు ఆగమవుతాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా దీవించాలని మొక్కుకున్నారు.
– న్యాల్కల్
పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు రోడ్డెక్కారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గేట్ వద్ద కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా క్యాన్లలో ఉన్న పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. విజయా డెయిరీకి పాలుపోస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.
– కల్వకుర్తి
విద్యుత్తు అధికారులు కరెంట్ సరఫరా నిలిపి వేయడంతో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లోని సుభాష్‌నగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం వారు స్థానిక ఏఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
– భీమ్‌గల్
‘రుణమాఫీ కోసం బ్యాంకుకు వెళ్తే వడ్డీ డబ్బులు కట్టించుకొని రసీదు ఇస్తలేరు.. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం నెల రోజుల తర్వాత రమ్మంటున్నారు’ అని బ్యాంకు అధికారుల తీరుపై మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం వారు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లితోపాటు పలు గ్రామాల రైతులు నెల్లికుదురు ఎస్బీఐ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోన్ స్టేట్మెంట్, లోన్ వడ్డీ చెల్లించడానికి రోజుల తరబడి బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
– నెల్లికుదురు