జనగామ, జూలై 15 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాలో సాగునీటి కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. జనగామ మండలం వడ్లకొండలో జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై నీళ్లు లేక ఎండిపోయిన వరి నారు కట్టలతో మంగళవారం బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గోదావరి జలాలతో తమ గ్రామంలోని ఏనె చెరువు నింపాలని..ఎండిపోతున్న పంటలు కాపాడేందుకు వెంటనే బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి దేవాదుల నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా.. రైతులను పట్టించుకున్న నాథుడే లేడని మండిపడ్డారు.
వర్షాలపై ఆధారపడి వేసుకున్న పంటలు ఎండిపోతుంటే రెండు పంపుల ద్వారా దేవాదుల నీటిని విడుదల చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా.. నీటి విడుదలలో సంబంధిత అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నిరుడు కూడా ఇదే నిర్లక్ష్యంతో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామ చెరువు నింపుతామని కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. డీసీపీ మహేంద్రనాయక్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడించడంతో ఆందోళన విరమించారు.
జనగామ జిల్లాలో దేవాదుల నీటి కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. మంగళవారం వడ్లకొండలోని జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ఎండిన వరి నారుతో రాస్తారోకో చేపట్టారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.