ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరి ఈనిన దశలో సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే రూ.వేలల్లో పెట్టుబడి పెట్టిన రైతులు.. నెర్రెలు వారుతున్న పొలాలకు నీరందించేందుకు చేయని భగీరథ ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు ఆశాజనకంగా లేవు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వర్ధవాని చెరువు తండాకు చెందిన రైతు కమలమ్మ రెండు ఎకరాల్లో వరి చేసింది. ఉన్న ఒక్క బోరులో నీరు అడుగంటి పోవడంతో మొత్తం పంట ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పంట పోయి అప్పులే మిగిలాయని రోధిస్తున్నది.
జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో గోదావరి జలాలు రాకపోవడంతో కాల్వ ఎండిపోయింది. చుక్క నీరు లేక సమీపంలోని పొలాల్లో పొట్ట దశలో ఉన్న వరి ఎండిపోతున్నది. కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తే తమ పంటలు పండేవని రైతులు చెప్తున్నారు. గతంలో పంట ఎండిపోయిన సందర్భాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కరువొచ్చిందని వాపోతున్నారు. ఎండిన పొలాన్ని పశువులకు మేపుతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఖైర్గూడ పంచాయతీలోని కొలాంగూడ, గొల్లగూడేల్లో తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. బోరుబావులు అడుగంటడం, మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో నీటిఎద్దడి నెలకొన్నది. భగీరథ పైప్లైన్ ఉన్నా రోజూ నీటిని సరఫరా చేయడం లేదు. ఐదు నుంచి పది బిందెల నీళ్లు మాత్రమే వస్తున్నాయని, అవి సరిపోక, గొల్లగూడ సమీపంలోని గుండాలవాగు నుంచి డ్రమ్ముల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నామని స్థానికులు తెలిపారు.