మర్రిగూడ, జనవరి 9: నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలంలో నిర్మిస్తున్న శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు బాధితుల ఆందోళనతో నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులు 257 మందికి బుధవారం చింతపల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 154లో డ్రా పద్ధతిలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ సమక్షంలో స్థలాలను కేటాయించారు. మొత్తం 289 మందికి ఇవ్వాల్సి ఉండగా, 32 మందికి స్థలాలు రాలేదు. ప్లాట్లు రాని బాధితులు అధికారుల తీరుకు నిరసనగా గురువారం ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఇప్పటికే తాము చాలా నష్టపోయామని గ్రామాన్ని ఖాళీ చేస్తే తమను ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు.
పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ చర్లగూడెం ముంపు బాధితులు ఈ నెల 7న ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం గురువారం చర్లగూడెంలో గ్రామసభ నిర్వహించనున్నామని, చండూరు ఆర్డీవో శ్రీదేవి గ్రామసభకు వస్తారని అధికారులు చెప్పడంతో 200 మంది వరకు గ్రామసభకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎదురుచూసినా ఆర్డీవో రాలేదు. అదే సమయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, ఎస్టీ హాస్టల్, కేజీబీవీ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించగా ఆర్డీవో వెంటే ఉన్నారు. కలెక్టర్‌ను అడ్డుకుంటామనే ఆర్డీవో తమను గ్రామసభ పేరుతో డైవర్ట్ చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు నిర్వాసితులు ప్రయత్నించగా ఇరిగేషన్ ఈఈ రాములు, డీఈఈ ఖాసీం నచ్చచెప్పారు.