బల్మూరు, జూన్ 5 : ఉమామహేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గురువారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం, బల్మూరు, మైలా రం, అంబగిరి గ్రామల్లో భూ సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయ భూముల్లో సర్వే చేస్తూ జెండాలు పాతుతుండగా రైతులు వాటిని తొలగించారు. ‘మా ప్రాణాలు పోయినా సరే.. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదు’ అని తేల్చిచెప్పారు. మొదట చేపట్టిన సర్వే ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సూచించారు.
ప్రాజెక్టులో అధికార పార్టీకి చెందిన బడా నాయకుల భూములు పోకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు భూములు కోల్పోయేలా సర్వే ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. రైతులు సర్వేను అడ్డుకున్నారని తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసులు భారీ బం దోబస్తుతో అక్కడిని చేరుకొని వ్యవసాయ భూముల్లో సర్వే నిర్వహించారు. అయితే పోలీసులను పెట్టి బెదిరించి సర్వే చేస్తే తాము ఆత్మహత్యకు పాల్పడతామని కొంతమంది రైతులు అధికారులను హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులు బాలస్వామి, రమేశ్, లక్ష్మణ శ్రీనివాస్, సీఐలు నాగరాజు, శ్రీనివాసులు, ఎస్సైలు రమాదేవి, వెంకట్రెడ్డి, విజయభాస్కర్ ఉన్నారు.