రంగారెడ్డి, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/కడ్తాల్: రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వేను మంగళవారం రైతులు అడుగడుగునా అడ్డుపడ్డారు. తమ ప్రాణాలు పోయినా సరే, సర్వేను సాగనివ్వబోమంటూ రైతులు అడ్డుకోవడంతో చేసేదేమీలేక అధికారులు వెనుదిరిగారు. కందుకూరు మండలం బేగరికంచ వద్ద నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి పంజాగూడ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి సర్వే పూర్తిచేసింది. అప్పుడు కూడా రైతులు అడుగడుగునా అడ్డుతగలడంతో పోలీసు బందోబస్తు మధ్య సర్వే నిర్వహించారు. రెండోవిడతలో భాగంగా సుమారు 21 కిలోమీటర్ల పొడవున 330 అడుగుల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం 554 ఎకరాల భూమి సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అందులోభాగంగా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎక్వాయిపల్లిలో సర్వే నిర్వహించేందుకు మంగళవారం అధికారులు రావడంతో వారిని స్థానికులు అడ్డుకున్నారు.
రైతుల నిరసనతో వెనుదిరిగిన అధికారులు
సర్వే నిమిత్తం ఎక్వాయిపల్లికి వచ్చిన రెవెన్యూ, సర్వే అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లో సర్వే ఎలాచేస్తారని అధికారులను నిలదీశారు. తమకున్న ఎకరం, రెండెకరాలను రోడ్డు కోసం తీసుకుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. తమ భూముల నుంచి తమకు తెలియకుండా రోడ్డు వేయడంతో తాము వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ అంగీకారం లేకుండా తమ భూముల్లో 330 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయడం వల్ల తమకున్న కొద్దిపాటి భూములు రోడ్డులోనే పోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యవసాయమే తమకు బతుకుదెరువని, ఉన్న భూములను లాక్కుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. భూమికి బదులుగా భూమిస్తేనే తాము సర్వేకు సహకరిస్తామని, లేని పక్షంలో ఎట్టి పరిస్థితిలోనూ సర్వే జరుగనిచ్చేది లేదని రైతులు అడ్డుకోవడంతో అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు.
నిద్ర పట్టడం లేదు
ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును తమ గ్రామాల నుంచి వేస్తామని ప్రకటించినప్పటి నుంచి భూములు పోతాయన్న భయంతో తమకు నిద్ర పట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమకు బతుకుదెరువు చూపిస్తున్న భూములను లాక్కొని తమను వీధిపాలు చేయడం సమంజసం కాదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా తాము ఈ భూములను నమ్ముకుని జీవిస్తున్నామని, ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫ్యూచర్‌సిటీ వలన తమకు లాభం ఉంటుందో, లేదో తెలియదు కాని, ఫ్యూచర్‌సిటీకి వేసే రోడ్డు వల్ల తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాగు భూములను రోడ్డు కోసం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ భూముల నుంచి రోడ్డు వేసే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
1,003 ఎకరాలు రోడ్డుపాలు
రంగారెడ్డి జిల్లాలో తొలి విడతగా కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి పంజాగూడ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 300 అడుగుల రోడ్డు నిర్మాణానికి 449ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి సర్వే పూర్తి చేసింది. ఇప్పుడు తాజాగా పంజాగూడ నుంచి ఆకుతోటపల్లి వరకు 21 కిలోమీటర్ల మేర 330 అడుగుల రోడ్డు నిర్మాణానికి 554ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. దీంతో మొత్తంగా 1,003 ఎకరాల భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తున్నది.