రాష్ట్రంలో వాన ముఖం చాటేసింది. 20 రోజులైనా చినుకు జాడ కరువైంది. ఫలితంగా అన్నదాత ముఖంలో ఆందోళన నెలకొన్నది. మండుతున్న ఎండలతో ఒకవైపు నారుమళ్లు వాడుతుండగా, నాటిన విత్తనాలు మట్టిలోనే మగ్గి పోతున్నాయి. వాటిని కాపాడుకొనేందుకు అన్నదాతలు నానా యాతన పడుతున్నారు.
కొన్నిచోట్ల ట్యాంకర్ల ద్వారా నారుమడులకు నీరు పడుతుండగా, మెట్టచేన్లల్లో బిందెలతో నీరుపోస్తూ కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వానలు కురువాలని పలు గ్రామాల్లోని ఆలయాల్లో జలాభిషేకాలు చేస్తున్నారు. కొన్నిగ్రామాల్లో కప్పతల్లి ఆటలాడుతున్నారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వేసిన పత్తి పంటను బతికించుకునేందుకు ఓ రైతు కుటుంబం పడరాని పాట్లు పడుతున్నది. ఇంటి వద్దనున్న బావి, బోరు నుంచి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి మొక్కలకు పోస్తున్నారు. వర్షాలు లేకపోవడం, ఎరువుల ధరలు భారీగా పెరుగడంతో సాగు కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– హాజీపూర్

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన రైతు భూక్యా బాలకిషన్ తనకున్న మూడు ఎకరాల్లో వరి నారు వేశాడు. 15 రోజులైనా వర్ష్షాలు పడక నారు ఎండిపోతుండటంతో ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి పోసి కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. రూ. 3 వేలు పెట్టి మూడు ట్యాంకర్లు పోశానని, పెట్టుబడి అధికమవుతుందని, వర్షాలు కురుస్తాయా? పంటలు పండుతాయా? అని ఆందోళన చెందుతున్నాడు.
– బయ్యారం

మహబూబాబాద్ జిల్లా అమనగల్ శివారులో మంగళవారం ఓ రైతు కుటుంబం పత్తి మొక్కలను కాపాడుకొనేందుకు బిందెలతో నీటిని తీసుకొచ్చి తడుపుతున్న దృశ్యం ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కింది.
– మహబూబాబాద్ ఫొటోగ్రాఫర్

అలంపూర్ చౌరస్తా, జూలై 14: వానలు కురువాలని కోరుతూ మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం మారమునగాల-1 గ్రామస్తులు ఆలయాలకు జలాభిషేకం చేశారు. కృష్ణానదికి వెళ్లి పూజలు నిర్వహించి, ఆ నీటితో అభిషేకం చేశారు.

కోటగిరి/డిచ్పల్లి/బోధన్ రూరల్, జూలై 14: నిజామాబాద్ జిల్లాలో బోర్లు ఆధారంగా చేసుకొని పలుచోట్ల రైతులు నార్లు వేశారు. వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎత్తిపోతున్నాయి. తడి లేక మడులు ఇలా నోర్లు తెరుస్తున్నాయి.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ శివారులో తల్లీకొడుకు నల్లా నీరు పడుతూ ఎండిపోతున్న నారును ఇలా కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
– బాన్సువాడ రూరల్