నల్లగొండ ప్రతినిధి, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : నల్లగొండలో ఈ నెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న రైతు మహాధర్నాకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. షాబాద్ రైతు ధర్నా వేదికగా కేటీఆరే నల్లగొండ మహాధర్నాపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాంతో శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా నల్లగొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. మహాధర్నాకు అనుమతి, స్థలం ఎంపిక, స్వచ్ఛందంగా తరలివచ్చే రైతుల సంఖ్య, అందుకు పార్టీపరంగా చేయాల్సిన ఏర్పాట్లు, ధర్నా స్థలంలో కల్పించాల్సిన సౌకర్యాలు, తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో రైతులను కదిలిస్తే ఎవరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంతృప్తిగా లేరని, కేసీఆర్ పాలననే గుర్తు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా కేటీఆర్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పెద్ద సంఖ్యలో రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. పార్టీ కార్యాలయం నుంచి ముఖ్య నేతలంతా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను కలిసి ఈ నెల 21న నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో రైతుమహాధర్నాకు అనుమతి కోరుతూ లేఖను అందజేశారు. మహాధర్నాకు కేటీఆర్ హాజరవుతున్నారని, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా ఉంటుందని ఎస్పీకి తెలిపారు. అనంతరం నేతలంతా క్లాక్‌టవర్ సెంటర్లోని ధర్నా స్థలాన్ని పరిశీలించారు. రైతుమహాధర్నాకు సర్కార్ సాయం అందని రైతులంతా పార్టీలకతీతంగా తరలిరావాలని బీఆర్ఎస్ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్, బడుగుల లింగయ్య యాదవ్, కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.