‘హైదరాబాద్ మహా నగరం మూడు నగరాలుగా ఏర్పడితే.. బేగరి కంచె కేంద్రంగా నేను నాలుగో నగరాన్ని సృష్టిస్తున్నా!’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానికి ఫోర్త్‌సిటీ.. ఫ్యూచర్‌సిటీ అంటూ పేర్లు పెట్టారు. ఇంతకీ ఫోర్త్‌సిటీ ఎక్కడ ఏర్పాటవుతుంది? దాని విస్తీ ర్ణం ఎంత? సర్వేనంబర్లు ఏవి? దాని హద్దులు ఎక్కడ? తెలంగాణ తలరాతను మారుస్తుందని చెప్తున్న ఈ ఊహానగరికి కనీసం ముసాయిదా మాస్టర్ ప్లాన్ అయినా రూపొందించారా? మరి.. 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీనే ఏర్పాటు చేస్తే.. ఆ భావి నగరానికి భూములేవీ?
విశాల రహదారులు.. వాటికి ఇరువైపులా కండ్లు చెదిరే ఆకాశహర్మ్యాలు.. అత్యాధునిక మౌలిక వసతులు.. పార్కులు.. స్విమ్మింగ్ పూళ్లు.. క్రీడా మైదానాలు.. ఇలా ఒక్కటేమిటి! చూసేందుకు రెండు కండ్లూ చాలవు. ఊహకు కూడా మన మేధస్సు సరిపోదు! అందమైన బ్రోచర్.. అంతకంటే అందమైన గ్రాఫిక్స్‌తో ప్రీలాంచ్ ప్రాజెక్టుల కోసం రియల్ ఎస్టేట్ కంపెనీలు అరచేతిలో చూపించే స్వర్గమిది!
అసలు భూమే ఉండదు! సర్వే నంబర్లేవో తెలియవు! కానీ, అక్కడ నగరమే ఏర్పాటైనట్టుగా రంగురంగుల డిజైన్లతో మతి పోగొట్టే గ్రాఫిక్స్‌తో బ్రోచర్లు వండి వార్చి.. ‘కూటి కోసం కోటి విద్యలు’ అన్నట్టు ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్రైవేటు కంపెనీలు ఎంతకైనా తెగిస్తాయి. ప్రీలాంచ్ పేరిట మోసం చేసే ఇలాంటి రియల్ కంపెనీలపై కేసులు నమోదవుతుంటాయి.
‘చరిత్రలో హైదరాబాద్ మహా నగరం మూడు నగరాలుగా ఏర్పడితే.. బేగరి కంచె కేంద్రంగా నేను నాలుగో నగరాన్ని సృష్టిస్తున్నా!’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దానికి ఫోర్త్‌సిటీ.. ఫ్యూచర్‌సిటీ అంటూ నోటికొచ్చిన పేర్లు పెట్టారు. భావి తరాలకు ఇదే స్వర్గధామం అంటూ ముఖ్యమంత్రి సహా మంత్రులంతా బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రకటనలు గుప్పించారు. ఇక్కడే ఏఐ సిటీ.. స్పోర్ట్స్ సిటీ.. ఐఐహెచ్‌టీ.. జూపార్కు.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు.. రేస్ క్లబ్.. ఇలా ఒక్కటేమిటి! 11 నెలల్లో సీఎం రేవంత్ నోటి వెంట జాలువారిన అనేక ప్రాజెక్టులకు ఫోర్త్సిటీలోనే భూ కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇంతకీ ఫోర్త్‌సిటీ ఎక్కడ ఏర్పాటవుతుంది? దాని విస్తీర్ణం ఎంత? సర్వేనంబర్లు ఏవి? దాని హద్దులు ఎక్కడ? తెలంగాణ తలరాతను మారుస్తుందని చెప్తున్న ఈ ఊహానగరికి కనీసం ముసాయిదా మాస్టర్ ప్లాన్ అయినా రూపొందించారా? మరి.. 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీనే ఏర్పాటు చేస్తే.. ఆ భావి నగరానికి భూములేవీ? ప్రత్యేకంగా భూసేకరణ చేయడం లేదంటే ప్రైవేట్ రియల్ కంపెనీలు పాల్పడే ప్రీలాంచ్ మోసాలకూ.. దీనికీ తేడా ఏమున్నది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఇలా కోర్టుకు ఓ మాట చెప్పి.. అందుకు విరుద్ధంగా గాల్లో మేడలు కడుతూ మభ్యపెట్టడాన్ని ఏమనాలి?!
Future City | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి భూసేకరణ చేయాలి. ఏయే సర్వేనంబర్లలో ఏర్పాటు చేస్తున్నారో రికార్డులు రూపొందించాలి. కనీసం ముసాయిదా మాస్టర్‌ప్లాన్ అయినా తయారు చేయాలి. మరి.. గత 11 నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి నోటి నుంచి జాలువారుతున్న ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భూతద్దం వేసి వెతికినా ఇవేవీ కనిపించడం లేదేంటి? వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. దీనికోసం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333.20 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.
ఇందులో 9,806.05 ఎకరాలు రైతుల వద్ద ఉన్న ప్రైవేట్ భూమి కాగా, గతంలో టీఎస్ఐఐసీ రైతుల నుంచి సేకరించిన 400.75 ఎకరాలు, 2,704.90 ఎకరాల ప్రభుత్వ భూమి, టీఎస్ఐఐసీ ఆధీనంలోని మరో 6,209.50 ఎకరాలు, వంద ఎకరాల ట్రాన్స్‌కో భూములతో పాటు 110 ఎకరాల విస్తీర్ణంలో నీటి వనరులున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇందులో దాదాపు 14 వేల ఎకరాలకు పైగా భూ సేకరణ పూర్తి చేసింది. రైతుల నుంచి సేకరించిన పట్టా భూములు సుమారు 3-4 వేల ఎకరాల వరకు ఉండగా మిగిలినది సేకరించాల్సి ఉన్నది. ఫార్మాసిటీ ఏర్పాటుకు గాను మొదటి దశ అనుమతులు కూడా వచ్చాయి. తుది అనుమతులు రావాల్సి ఉన్నది. ఫార్మాసిటీలో కంపెనీల ఏర్పాటు కోసం 300-350 కంపెనీలు దరఖాస్తు కూడా చేసుకున్నాయి.
రైతుల నుంచి సేకరించిన పట్టా భూమి ఎకరాకు రూ.16.50 లక్షల వరకు, అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.8.5లక్షల వరకు పరిహారం ఇచ్చింది. భూమిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చేందుకు కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 1400 ఎకరాల భూమి సేకరించి.. లే అవుట్ చేసి ఎకరాకు 121 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాటును కూడా పంపిణీ చేసింది. భూములు కోల్పోయిన రైతు కుటుంబాల్లో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కందుకూరు మండల పరిధిలో 1400, యాచారం మండల పరిధిలో 3600 మందిని గుర్తించింది. వీరిలో సాంకేతిక అర్హతలు లేని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు డ్రైవ్ కూడా చేపట్టింది. తుది అనుమతులు రాగానే దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో ప్రాధాన్యత, ఇతర అర్హతల మేరకు భూ కేటాయింపులు జరిగేవి. కానీ గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం షరతుతో కూడిన భూసేకరణ చేపట్టింది. రైతుల నుంచి సేకరిస్తున్న భూములను కేవలం ఫార్మా, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన వాటి కోసమే వినియోగిస్తామని, లేనిపక్షంలో రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామనేది ఆ షరతు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు కేవలం ఫార్మాసిటీ కోసం మాత్రమే ఆ భూములను వినియోగించేందుకు పూర్తిస్థాయి ప్రక్రియలు చేపట్టింది. భూసేకరణ సమయంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఫార్మాసిటీ కోసం రైతుల భూములను ఎలా తీసుకుంటారంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు రేవంత్‌రెడ్డి సహా ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పాదయాత్రలో ‘అధికారంలోకి వస్తే ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మ్యానిఫెస్టోలో కూడా ఈ మేరకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ రైతులు దీక్షలు.. డిమాండ్లు చేస్తున్నా ఆ హామీని తుంగలో తొక్కింది.
ఫార్మాసిటీ కోసం చేపట్టిన భూసేకరణ అనేది షరతుతో కూడినది. కచ్చితంగా ఫార్మా, అనుబంధ రంగాల కోసం భూమిని వినియోగించాలి.. లేకుంటే రైతులకు తిరిగివ్వాలనేది నిబంధన. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో ప్రకటనతో ఫార్మాసిటీ ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టింది. దీంతో భూములు కోల్పోయిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ భూములు తిరిగివ్వాలని కోరారు. ‘అసలు ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారా?.. సమాధానం ఇవ్వండి’ అని హైకోర్టు ఆదేశించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా అఫిడవిట్ సమర్పించింది. అందులో ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేలకు పైగా ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని, ఆ భూములను అందుకే వినియోగిస్తామని హామీ ఇచ్చింది.
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నదనేది అక్షర సత్యం. ఇందుకు సజీవ సాక్ష్యమే.. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ! యూనివర్సిటీ ఏర్పాటు స్వాగతించదగినదే అయినా దాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. పారదర్శకంగా వ్యవహరించాలి. గతంలో బేగరికంచె వద్ద యూనివర్సిటీని 150 ఎకరాల్లో ఏర్పాటు చేస్తానని సీఎం రేవంత్ ప్రకటించి, శంకుస్థాపన కూడా చేశారు. ఇటీవల మెగా ఇన్ఫ్రా కంపెనీ యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం పనులు మొదలుపెట్టింది.
కందుకూరు మండలం మీర్ఖాన్పేట పరిధిలోని బేగరికంచెలో సర్వేనంబరు 112, ఆకుల మైలారం పంచాయతీ పరిధిలోని పంజాగుడలోని సర్వేనంబరు 90ల్లోని 150 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటు కానున్నది. వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం ఈ భూములను షరతుతో సేకరించింది. అంటే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫోర్త్‌సిటీని ఏర్పాటు చేస్తున్నారనేది రుజువైంది. ఇదే కాదు.. ఫోర్త్‌సిటీ పేరిట సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు అనేకసార్లు ఫార్మాసిటీ భూముల్లో ఇతర రంగాలకు చెందిన ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేస్తామంటూ ప్రకటించారు.
‘కాలుష్య కారక ఫార్మాసిటీ నగరానికి సమీపంలో కాకుండా.. సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయాలి’
నిరుడు డిసెంబర్ 13న జరిగిన సమీక్షా సమావేశంలో ఫార్మాసిటీకి బదులు ఆ భూముల్లో మెగాసిటీ ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనలో భాగంగా చేసిన వ్యాఖ్య ఇది..
‘ఔటర్ రింగు రోడ్డు – ట్రిపుల్ ఆర్ మధ్యలో పారిశ్రామికవాడల గుర్తింపు కోసం 500 నుంచి 1000 ఎకరాల భూసేకరణ చేయండి’ డిసెంబర్ 18న (ఐదు రోజుల వ్యవధిలో) నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశమిది.
‘ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు’ జనవరి 1న మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన
ప్రకటన ఇది
‘ఔటర్ రింగు రోడ్డు – ట్రిపుల్ ఆర్ మధ్య మూడు వేల ఎకరాల్లో వివిధ ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఫార్మాసిటీ విధానం సరికాదు. అందుకే దాన్ని రద్దు చేసి, అక్కడ శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ గత మార్చిలో జరిగిన కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటన ఇది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి కేసీఆర్ హయాంలో చివరి దశకు వచ్చిన ఫార్మాసిటీ ఏర్పాటుపై ఇలా పూటకో ప్రకటన చేసి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టింది. రైతుల త్యాగాన్ని అపహాస్యం చేసింది.
కేసీఆర్ హయాంలో సేకరించిన 14 వేలకు పైగా ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఫోర్త్‌సిటీ పేరిట సాగుతున్న ఈ కేటాయింపుల పర్వానికి భూములు ఎక్కడివి? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఓవైపు ఫార్మాసిటీ భూముల్లోనే వీటిని ఏర్పాటు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవిధంగా నిబంధనల ప్రకారం రైతులకు తిరిగి భూములు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే రేవంత్ ప్రభుత్వం కోర్టులో ఓ మాట.. బయట ఇంకో మాట చెప్తూ పబ్బం గడుపుతున్నదనేది సుస్పష్టం. ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇలా వ్యవహరిస్తే ఏమోగాని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే ఇలా రైతులకు తిరిగి భూములు ఇవ్వాల్సి వస్తుందని కోర్టు అఫిడవిట్లో ఒక హామీ ఇచ్చి, బయట భిన్నంగా వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తున్నది.
ఫోర్త్‌సిటీ పేరిట రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన భూ కేటాయింపులే దాదాపు 15 వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. ఈ క్రమంలో ఫార్మాసిటీ భూములను పూర్తిగా ఫ్యూచర్‌సిటీకి వినియోగించినా ఇంకా అదనంగా భూములు కావాల్సి ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా భూసేకరణ చేపట్టనుందా? ఇదే జరిగితే.. మరి ఫార్మాసిటీ ప్రాజెక్టును అటకెక్కించినట్టేనా? అందుకే ఫార్మాసిటీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు మరో 20వేల ఎకరాల భూసేకరణ చేపడుతున్నారా? అనే ప్రశ్నలకు బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరమున్నది.