నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, జూలై 3: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్‌ల వద్ద బారులుతీరున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలోని పీఏసీఎస్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయమే రైతులు రెబ్బెన పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలు దాటినా కార్యాలయం తెరుచుకోకపోవడంపై మండిపడుతూ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని సహకార సంఘానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందు వచ్చిన రైతులకు మూడు బస్తాల చొప్పున పంపిణీ చేయడం, లైన్లో ఉన్న చాలా మందికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండ మండలం మందపల్లి, మహ్మదాపురం సొసైటీల్లోని కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం 6 గంటల నుంచే రైతులు బారులుతీరారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తున్నామని సొసైటీ సిబ్బంది చెప్పడంతో రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్, సొనాల మండల కేంద్రాల్లోని సహకార సంఘాల గోదాముల వద్ద ఒక్కో రైతుకు ఐదు బస్తాల చొప్పున పంపిణీ చేయగా, మిగతా వారు వెనుదిరిగారు.
నిర్మల్ జిల్లా ముథోల్‌లో పీఏసీఎస్ వద్ద ఉదయం నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులోని పీఏసీఎస్ ఎరువుల గోడౌన్ వద్దకు, గుండాల మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్దకు గురువారం తెల్లవారుజామున భారీగా చేరుకున్న సొసైటీ పరిధిలోని రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాశారు. ఆధార్ కార్డులతో యార్డుకు, పీఏసీఎస్‌కు చేరుకున్న రైతులు క్యూలో నిల్చునే ఓపిక లేకపోవడంతో జిరాక్స్ ప్రతులను అధికారుల ముందు వరుసగా పెట్టి యార్డు షెడ్ల కింద, చెట్ల కింద, రోడ్ల వెంట రోజంతా కూర్చున్నారు.