హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రైతులకు ఆదాయం, భద్రత పెంచే మార్గాలపై విసృ్తతస్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ‘రైతు ఆదాయం భద్రత-మార్గాలు, ప్రత్యామ్నాయ విధానాలు’ అనే అంశంపై మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన సదస్సులో జానయ్య మాట్లాడారు. రాష్ట్రంలో వరి విస్తీర్ణం బాగా పెరిగిందని, అవసరానికి మించి పెరిగిన వరి ఉత్పత్తి కొనుగోలు, నిల్వలతో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రస్తుత విధానాల్లో మార్పు చేయాలని, ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులు పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు పండించేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు.