నేరేడుచర్ల, నవంబర్ 14 : ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ రైస్ మిల్లు ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. దిర్శించర్ల సమీపంలో కొత్తగా రైస్ మిల్లు నిర్మించే సమయంలో ఆ మిల్లు యజమానులు గ్రామ రైతులతో కలిసి మిర్యాలగూడ మిల్లర్లు చెల్లించే ధరకు అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. మిల్లు సమీపంలోని పొలాల్లో పండించే క్వింటా ధాన్యానికి రూ.100, దూరంగా ఉన్న పొలాలకు రూ.50 అదనంగా చెల్లిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన బొమ్మనబోయిన గంగయ్య ట్రాక్టర్లో ధాన్యం తీసుకొని సాయి హనుమాన్ రైస్ మిల్లుకు వెళ్లగా తక్కువ ధరకు ధాన్యం తీసుకుంటామని తెలిపారు.
మిర్యాలగూడలో రూ.2,500 క్వింటా నడుస్తుండగా, ఇక్కడ మాత్రం రూ.2,350 చెల్లిస్తామనడంతో మిల్లు యజమానితో వాగ్వాదానికి దిగాడు. మిల్లు యజమాని.. ‘నీ ధాన్యం బాగాలేదు. అసలు తీసుకోం’ అని చెప్పడంతో ఆగ్రహించిన రైతు గంగయ్య ట్రాక్టర్లో తీసుకొచ్చిన ధాన్యాన్ని మిల్లు గేటుకు అడ్డంగా పోశాడు. విషయం తెలుసుకున్న దిర్శించర్ల రైతులు అక్కడికి చేరుకొని మొదట అనుకున్న ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగారు. మిల్లు యజమాని అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించారు. కొంతమంది రైతులు నాణ్యత లేని ధాన్యం తీసుకువచ్చి అధిక ధర చెల్లించాలని డిమాండ్ చేస్తే మిల్లు నడపడం కష్టమని మిల్లు యజమాని పేర్కొన్నాడు.