Irukulla Vagu | కరీంనగర్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పదేండ్లలో జీవధారగా ఉన్న ఇరుకుల్ల వాగు ఎండిపోయింది. రాళ్లు.. రప్పలు, ఇసుక తప్ప చుక్కనీరు కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు జీవధారగా పారిన వాగు ఒక్కసారిగా వట్టి పోయింది. వాగును నమ్ముకుని సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంటలు ఎండిపోగా ఇంకొన్ని పంటలను రక్షించుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బావుల అడుగులు తవ్వించుకుంటున్నారు. కొత్త బోర్లు వేయించుకుంటున్నారు. అయినా పంటలను రక్షించుకునే మార్గం కనిపించడం లేదని దిగులు పడుతున్నారు. వాగులోకి తక్షణమే నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తాయని వేడుకుంటున్నారు.
ఏడాదిన్నర కిందటి వరకు సజీవ ధారలా కనిపించిన ఇరుకుల్ల వాగు ఎండి ఎడారిలా మారింది. రామడుగు మండలం మోతె నుంచి వచ్చే ఈ వాగును ఆ మండలంలో మోతె వాగు అని, కరీంనగర్ మండలంలో ఇరుకుల్ల వాగు అని స్థానికులు పిలుచుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వంలో నారాయణపూర్ రిజర్వాయర్‌తో అనుసంధానించిన ఈ వాగులో నిత్యం నీటి ధారలు కనిపించేవి. భూగర్భజలాలు వృద్ధి చెం ది ఈ వాగు పరిసర గ్రామాల రైతులకు సమృద్ధిగా సాగు నీరు ఉండేది. వాగులో తవ్వుకున్న బావులు, బోర్లలో ఏడాది పొడుగునా నీళ్లుండేవి. 24 గంటలు కరెంట్ మోటార్లు నడిచినా బావుల్లో నీళ్లు ఒడిచేవి కాదు. దీంతో ఈ వాగు పరిసరాల్లోని పలు మండలాల పరిధిలో వం దల ఎకరాల్లో పంటలు పుష్కలంగా పండేవి. సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పంటలు పండించుకునే వారు.
గత వానకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించేది. నగునూర్, ఇరుకుల్ల, ముగ్ధుంపూర్ గ్రామాల్లో ఉన్న చెక్ డ్యాంలలో నీళ్లు ఉండేవి. బావులు, బోర్లలో భూగర్భ జలాలు ఉండేవి. ఈ పరిస్థితిని చూసిన రైతులు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు వదులుతారనే నమ్మకంతో పరిసర ప్రాంతంలో వరి సాగు చేశారు. రెండు నెలల్లో పరిస్థితి తారుమారైంది. చెక్ డ్యాంలలో నీళ్లు లేకుండా పోయాయి. వేసవికి ముందే ఎండలు ప్రతాపం చూపుతుండడంతో వాగులోని బావులు కూడా క్రమంగా ఎండిపోతున్నాయి. ఇప్పటికే వాగులో తవ్వుకున్న బావులు అనేకం ఎండిపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారం పదిరోజుల్లో ఈ ప్రాంతంలో గతం పదేళ్లలో ఎన్నడూ చూడని దుర్భిక్షిం అలుముకునే ప్రమాదం ఉంది.