రామారెడ్డి, ఏప్రిల్ 19: కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీరే మిగిలింది. కేసీఆర్ జమానాలో హాయిగా పంటలు పండించుకున్న రైతాంగం.. రేవంత్ హయాంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నది. సాగునీరు ఇవ్వక, సరిపడా యూరియా అందించక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆగం జేసింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని వందల ఎకరాల్లో పంటలు ఎండుముఖం పట్టాయని రైతులు వాపోతున్నారు. గతంలో కాళేశ్వరంతో సమృద్ధిగా పంటలు పండిన పొలాలు నేడు బీడువారాయి.
నాడు ఆదుకున్న కాళేశ్వరం
రైతుల సాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. దిగువన ఉన్న గోదావరి జలాలను వందల కిలోమీటర్లు పైకెక్కించి, బీడు వారిన భూములకు జీవం పోశారు. ఫలితంగా వేలాది ఎకరాలకు సాగునీటి వసతి కలిగింది. మల్లన్నసాగర్ నుంచి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ఎల్లారెడ్డి చెరువుకు, అక్కడి నుంచి మోషంపూర్, రంగంపేట్, పోసానిపేట్, గొల్లపల్లి, రామారెడ్డి, కన్నాపూర్ తదితర గ్రామాలకు కాలువల ద్వారా గోదావరి జలాలు చేరాయి. మండు వేసవిలోనూ అనేక చెరువులు మత్తళ్లు దుంకాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాలు విడుదల చేయకపోవడంతో నీటికి కటకట ఏర్పడింది. కాలువలు పారకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లు సైతం ఎత్తిపోయాయి. ఫలితంగా పంటలు ఎండిపోయాయి.
పంట మొత్తం ఎండిపాయె
నాకు పదెకరాలు వ్యవసాయ భూమి, ఆరు బోర్లు ఉన్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఎనిమిది ఎకరాల్లో నాట్లు వేశాం. యూరియా దొరక్క ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. ఎన్నో తిప్పలు పడి, ఎరువుబస్తాలు సేకరించి పొలానికి వేశా. పంట ఏపుగా పెరిగిందని సంబురపడే లోపే నీటి సమస్య మొదలైంది. ఇప్పుడు పంట ఎండిపోయి పశువులకు మేతగా మారింది.
– ఒగ్గు వెంకటస్వామి, రామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా
సర్కార్మాట తప్పింది
భూమి కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా. యాసంగిలో అప్పులు తెచ్చి నాట్లు వేసిన. యూరియా దొరక్క మస్తు తిప్పలు పడ్డం. పంట మంచిగా ఉందనుకుంటున్న తరుణంలో నీటి సమస్య మొదలైంది. చూస్తుండగానే పంట ఎండుముఖం పట్టింది. గతంలో ఎప్పుడూ ఇట్లా నీళ్ల సమస్య లేకుండే. కౌలు రైతులను ఆదుకుంటానన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి పరిహారం ఇవ్వాలి.
– కడెం బైరయ్య, రామారెడ్డి మండలం,కామారెడ్డి జిల్లా