Ravi Cheruvu | సూర్యాపేట, మార్చి 9(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలపాటు చుక్కనీటికి నోచుకోని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం పరిధిలోని రావిచెరువుకు మళ్లీ పూర్వపు దుస్థితి ఏర్పడింది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావిచెరువుకు 2018-2023 వరకు గోదావరి జలాలు వచ్చాయి. దీంతో ఈ చెరువు జలకళ సంతరించుకున్నది. అలాంటిది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో చుక్క నీరు లేకుండాపోయింది. ఆయకట్టు పరిధిలోని పంట పొలాలు ఎండిపోతున్నాయి.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువుఛాయలు
బీఆర్ఎస్ హయాంలో ఐదేండ్లపాటు కాళేశ్వరం జలాలతో మండు వేసవిలో సైతం అలుగుపోసిన రావిచెరువులో ప్రస్తుతం రాళ్లు తేలుతున్నాయి. చిన్నపాటి విషయాన్ని భూతద్దంలో చూపుతూ కాళేశ్వరాన్ని పండబెట్టడంతో ఏడాది కాలంగా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. 205 ఎకరాల్లో విస్తరించి ఉన్న రావి చెరువు ప్రస్తుతం ఎండిపోయే దశకు చేరుకున్నది. 2019కు ముందు 50 ఏండ్లపాటు రావిచెరువుకు చుక్కనీరు చేరలేదు. ఎప్పుడో ఒకసారి భారీ వర్షాలు వస్తే 25 శాతం చెరువు నిండటమే గగనం. అలాంటిది 2019 నుంచి వరుసగా జలకళను సంతరించుకోవడమే కాదు అలుగు పోసింది. రావిచెరువు కింద 250 ఎకరాల ఆయకట్టుతోపాటు మండలంలోని మాచారం, పెన్పహాడ్, అనంతారం, పొట్లపహాడ్, భక్తళాపురం, ధర్మాపురం, గాజులమల్కాపురం గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా తయారైంది.
ఇప్పుడు కొంతమేర నీళ్లు ఉండగా చెరువు కింద సాగుచేస్తున్న పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోరు, బావులు వట్టిపోయాయి. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఏడాది గోదావరి జలాలు రాలే కేసీఆర్ పూర్తి చేసిన కాళేశ్వరంతో గోదావరి నీళ్లు కాల్వకు వచ్చినయి. నేను నాలుగేండ్లుగా రావి చెరువు కింద కొంత భూమిని కౌలుకు తీసుకొని చేస్తున్నా. ఈ ఏడాది నీళ్లు రాకపోవడంతో చెరువు ఎండిపోతున్నది. చెరువు కింద సాగు చేసిన వరి పొలాలు ఇప్పటికే సగం వరకు ఎండిపోయినయి. పొట్టకు వచ్చిన దశలో ఎండుతుండటంతో కాపాడుకునేందుకు చెరువులోకి పైపులు వేసి నీటిని అందిస్తున్నం. పూర్తి పంట అయ్యేంత వరకు ఆ నీళ్లు కూడా అందుతాయ లేదో తెల్వదు.
-భూక్య పంతులు, రైతు, గూడెపుకుంట తండా, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా