అల్లాదుర్గం, నవంబర్ 22 : తరుగు పేరిట రైస్‌మిల్లర్లు, అధికారులు కలిసి తమను దోపిడీ చేస్తున్నారని మెదక్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం అల్లాదుర్గం మండలం సీతానగర్‌లో హైదరాబాద్-నాందేడ్ జాతీయ రహదారిపై బైఠాయించారు. స్థానిక ఉమా వేంకటేశ్వర రైస్‌మిల్ యాజమాన్యం అడ్డగోలుగా బస్తాకు 5 కిలోల తరుగు తీస్తున్నదని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ సీతానగర్‌కు చెందిన రైతులు రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్లను నిలిపి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా సీతానగర్ ఐకేపీ సెంటర్లో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ అధికంగా మరో కిలో వరకు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఐదు కిలోల వరకు తాము నష్టపోవాల్సి వస్తున్నదని, అధికారులు, మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కై తమను దోపిడీ చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి నిరసన దిగాల్సి వచ్చిందని అన్నారు. రైతుల ధర్నాతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోచి రాకపోకలకు గంటసేపు అంతరాయం ఏర్పడింది. సీఐ రేణుక, ఎస్సై ప్రవీణ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రైతులను ధర్నా విరమించాలని కోరినా భీష్మించుకుని కూర్చున్నారు. ఆర్ఐ శరణప్ప, ఏపీఎం నాగరాజు.. రైతులు, రైస్ మిల్లర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.