‘వానలు పడ్తున్నయ్. వడ్లు ఎక్కడ తడుస్తయోనని భయమైతున్నది.. మీ కాల్మొక్త సారూ.. వడ్లు కొనండి..’ అంటూ మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కాళ్లపై పడి వేడుకుంటున్న హాజీపూర్ మండలం కర్నమామిడికి చెందిన రైతు బొడ్డు మధుకర్
ప్రభుత్వం వడ్లు, మక్కలు కొనాలని కోరుతూ నిర్మల్ జిల్లా రాజురా గ్రామ రైతులు శుక్రవారం అర్లి ఎక్స్‌రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. వెంటనే పంటలను కొనాలంటూ.. లోకేశ్వరం తహసీల్దార్ సూర్యారావు కాళ్లు మొక్కుతున్న రైతులు
రోజులు..వారాలు.. నెల దాటినా రైతాంగం పరిస్థితి మారలేదు. పంట మొదలు నుంచి అమ్ముకునే దాకా తీరని కష్టం..నష్టం వెంటాడుతున్నది. ఎరువుల ఇక్కట్లు మరచిపోకముందే ఇప్పుడు పంటను అమ్ముకునేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎదురైంది. ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు కడుపు మాడ్చుకొని కొనుగోలు కేంద్రాల్లో ఎదురుచూపులు రైతును కన్నీరు పెట్టిస్తున్నది. ధాన్యం, మక్క కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడం రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తున్నది. ఇంకెన్నాళ్లీ కష్టం దేవుడా అంటూ రైతాంగం ఆవేదన వ్యక్తంచేస్తున్నది.
హాజీపూర్, మే 8 : ‘వర్షాలు పడ్తున్నయి. ధాన్యం ఎక్కడ తడుస్తదోనని భయమైతంది.. మీ కాల్మొక్త సారూ.. వడ్లు కొనండి..’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్నమామిడి గ్రామానికి చెందిన రైతు బొడ్డు మధుకర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య కాళ్లపై పడి వేడుకున్నాడు. పడ్తన్‌పల్లి, కర్నమామిడి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనడం లేదంటూ ఆగ్రహించిన రైతులు శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-63పై ఎడ్లబండ్లతో దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. సమాచారమందుకున్న హాజీపూర్ ఎస్ఐ కిరణ్‌కుమార్ అక్కడికి చేరుకొని సజావుగా కొనుగోళ్లు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినా వారు వినకుండా కలెక్టర్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఎస్ఐ చేసేదేమీ లేక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు.

రాయపర్తి, మే8: చేతులు జోడించి దండం పెడుతున్న.. దయచేసి రైతులను ఇబ్బందులు పెట్టకండి.. మక్కలు కొనుగోలు చేసి వారిని ఆదుకోండి..’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంబంధిత అధికారులను వేడుకున్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మక్క రైతుల కష్టాలను తెలుసుకున్న ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం యాజమాన్యం రైతులను చిన్నచూపు చూస్తున్నదని వాపోయారు. రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. అనంతరం మార్క్‌ఫెడ్ జీఎంతో ఫోన్లో మాట్లాడుతూ రాయపర్తిలో మక్కజొన్న సాగు చేసిన రైతులు పడుతున్న కష్టాలను, ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. 24 గంటల్లో కొనుగోలు చేయకుంటే హైవేను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఎస్సై రాజేందర్ గారూ.. మీకు రైతుల కష్టాలు కనపడటం లేదా…ఇంత అధ్వానమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా చూశామా చెప్పండి అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

మోర్తాడ్, మే 8: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులను కన్నీరు పెట్టిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాలు తీస్తే తోలు తీస్తా అన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు రైతుల వద్ద నుంచి క్వింటాలుకు 10 కిలోల తరుగుతీస్తున్న మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, భీమ్‌గల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోళ్లలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంటా వేయక నెల రోజులుగా ధాన్యం కల్లాల్లోనే కుప్పలు, తెప్పలుగా పేరుకుపోవడం, అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంపై వేముల ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరిట దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఫోన్లో కోరారు.

మల్లాపూర్, మే 8: రెండు నెలల క్రితమే అసెంబ్లీ వేదికగా మొత్తుకున్నా రైతుల సమస్యలను పట్టించుకోలేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మక్కలు, వడ్ల కోనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం సమిష్టిగా హమాలీ పనులు చేసి ధాన్యం జోకుతాం” అని పేర్కొన్నారు.

జగిత్యాల, మే 8 : తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ మారెట్లో అ కాల వర్షానికి తడిసిన మకలను ఆయన శుక్రవారం పరిశీలించగా, ఈ సందర్భంగా రైతులు లారీలు రావడం లేదని జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తూకం వేసిన మకల సంచులు కూడా తడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్, మార్క్‌ఫెడ్ ఎండీ, అధికారులతో జీవన్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. మారెట్లోనే మూడు గోదాంల ఖాళీగా ఉన్నాయని, వాటిని కేటాయించాలని కోరారు. శుక్రవారం మకలు తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

గొల్లపెల్లి, మే 8 : ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిస్థాయిలో విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అక్కడ రైతుల కష్టాలను చూసి చలించిపోయి, వారితో కలిసి రాస్తారోకోకు దిగారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇంతయాతన పడాలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, జిల్లాలో ఏ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాడో?, ఏ రైతుతో మాట్లాడాడో? చెప్పాలని ప్రశ్నించారు.

మహబూబ్‌నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన ధాన్యం కొనమంటే గ్రామాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, లీడర్లను కాంగ్రెసోళ్లు కొంటున్నరని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ మండలంలోని రాంరెడ్డిగూడెం మిల్లు వద్ద వడ్లు విక్రయించేందుకు వాహనాల్లో సంచులు పెట్టుకొని ఎదురు చూస్తున్న రైతులతో మాజీ మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. రైతులు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం పంటలు కొనేదాకా కొట్లాడుతామని హామీ ఇచ్చారు. రైతులను అన్ని విధాలా ఇబ్బందుల పాలుజేసి రైతు వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు.

వరంగల్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో రైతుల కన్నీళ్లకు అంతులేదు. రహదారులపై ధాన్యం ట్రాక్టర్ల వరుసకు అంతులేదు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నిరీక్షణ తప్పడం లేదు. పంట ఉత్పత్తులను కాపాడుకోవడానికి రైతులకు రికామే లేదు. కరువునాడు కన్నీరే.. కడుపునిండా పంట పండినా కన్నీరే అన్నట్టుగా రైతన్న పరిస్థితి తయారైంది. భూమి మోసేంత పంట పండినా సరే.. కేసీఆర్ హయాంలో తన పంట కొనమని రైతు రోడ్డెక్కలేదు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ సర్కార్ పాలన అన్నదాతను దయనీయ దుస్థితికి చేర్చింది. పంట వేసిన నాటి నుంచి అమ్ముకునేదాకా అరిగోస పెడుతున్నది.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో శుక్రవారం కిలోమీటర్ల కొద్దీ చీమలుదారులు తీసినట్టే..మక్కజొన్న లోడ్లతో ట్రాక్టర్ల బారులు తీసిన దృశ్యమే ఇవ్వాళ రాష్ట్రంలో రైతు దయనీయ దృశ్యానికి సంకేతం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచింది. ఏఎన్ఐ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి మీడియా సంస్థల ప్రతినిధులు రహదారులపై బారులు తీరిన ట్రాక్టర్లను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. డ్రోన్ కెమెరాలకు కూడా సిగ్నల్ అందనంత దూరం ట్రాక్టర్ల బారులు తీరడం గమనార్హం. మునుపెన్నడూలేని దయనీయస్థితిని మక్క రైతులు ఈసారి అనుభవిస్తున్నారు. తమకు భరోసాగా నిలిచేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వంటి వారికి తమ గోడు చెప్పుకొంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

చొప్పదండి, మే 8: కోతల్లేకుండా ధాన్యం కొనాలని చొప్పదండి మండలం ఆర్నకొండ రైతులు శుక్రవారం రోడ్డెక్కారు. సర్కార్‌కు వ్యతిరేకంగా నినదించారు. తూకం వేసి సిద్ధంగా ఉన్న వేల బస్తాల ధాన్యం తరలించడం లేదని మండిపడ్డారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. రైతులపై ఇంతలా కక్ష సాధించడం.. ఇదేనా ప్రజా పాలన? అంటూ ధ్వజమెత్తారు. ఆర్డీవో, అదనపు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి రైతుల బాధలను వివరించారు. ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.

నెక్కొండ, మే 8 : ధాన్యం, మక్కల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా నెక్కొండలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపారు. పనికర గుట్ట ప్రాంతంలో అధికారులు బలవంతంగా మక్కలను నిల్వచేయించి పదిహేను రోజులు గడుస్తున్నా నేటికీ కొనలేదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షిస్తున్నా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్, డీసీవోతో మాజీ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి రైతుల ఇక్కట్లను తొలగించాలని కోరారు.

ఇబ్రహీంపట్నం, మే 8: తడిసిన మక్కలు కొనుగోలు చేయాలని శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజులు గడుస్తున్నా మక్కలు కొనకపోడం దారుణమని మండిపడ్డారు.

అకాల వర్షానికి తడిసిన మక్కలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు గేట్‌కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
-నర్సంపేట

కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగి నెలలు గడుస్తున్నా తమకు పరిహారం అందలేదని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. నష్టపరిహార సాధన కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అప్పు చేసి మరీ కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకుంటే అగ్నిప్రమాదం తమ జీవితాలను బుగ్గిపాలు చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
-మధిర

ధాన్యాన్ని ప్రభుత్వం కోనుగోలు చేయడం లేదని నారాయణరావుపేట రైతులు శుక్రవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట – ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ధాన్యం కుప్పలు పోసి నెలలు గడుస్తున్నా పట్టిచుకోవడం లేదని మండిపడ్డారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
– నారాయణరావుపేట

వడ్లు, మక్కలు కొనాలని కోరుతూ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్(జీ) మండలంలోని అర్లిఎక్స్ రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రాలకు మక్కలు, వడ్లు తీసుకువచ్చి 25 రోజులైనా పంట కొంటలేరని మండిపడ్డారు. లోకేశ్వరం తహసీల్దార్ అక్కడికి రాగానే ఇద్దరు రైతులు కాళ్లపై పడి పంటలు కొనాలని వేడుకున్నారు. రేపటిలోగా పది లారీలను సరిపడా గన్నీ బ్యాగులను తెప్పించి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
-నర్సాపూర్(జీ)