ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక ప్రారంభ దశలోనే పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వానకాలం సీజన్‌ను నమ్ముకొని వేసిన నారును కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడులో రైతులు వరి నారుకు ఇలా ట్యాంకర్లతో నీరు తెచ్చి పోస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : వర్షాభావ పరిస్థితులు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలకరి జల్లులను చూసిన రైతులు వరి నార్లు పోశారు. పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ పత్తి మొలకలు వచ్చాయి. వర్షాలు ముఖం చాటేయడంతో మొలకలు ఎండలకు మాడిపోయే పరిస్థితి దాపురించింది. మరోవైపు నీళ్లు అందక వరి నారు ఎండుగడ్డిలా మారుతున్నది. ఈ క్రమంలో అన్నదాతలు పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని వరినారును బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బిందెలతో పత్తి మొలకలకు నీరు పోస్తున్నారు. అప్పుడప్పుడు చిరు జల్లులు అలా వచ్చి ఇలా వెళ్లి పోతున్నాయే తప్ప మొక్కల వేర్లు తడవడం లేదు. వారం రోజులుగా చిరుజల్లులు సైతం కనిపించకుండా పోయాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కుంభంపల్లికి చెందిన కుంభం బాపునకు ఎకరా భూమి ఉన్నది. అందులో చిక్కుడు, బెండ, కాకరకాయ తోటలు వేశాడు. వర్షాలు లేక ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని బిందెలతో మొక్కలకు అందిస్తున్నాడు. అలాగే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లికి చెందిన బానోత్ కుమార్ మూడు ఎకరాల్లో నారు పోయగా నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయింది. నారును బతికించుకునేందు కు ట్యాంకర్లతో నీరు పోస్తూ అరిగోస పడుతున్నాడు. అలాగే జంగేడు, నాచారం శివార్లలో పత్తి పంటలు, నార్లు ఎండిపోతుండగా అక్కడ సైతం రైతులు ట్యాంకర్లతో నీరందిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే కర్షకులు సాగునీటికి తంటాలు పడుతున్నారు.