ఇల్లంతకుంట రూరల్, జూలై 4: ‘దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుని బతుకుతున్నాం. 50 ఏండ్ల క్రితం ప్రభుత్వం పట్టాలిచ్చింది. అందులోనే పంటలు వేసుకుంటున్నం. పట్టాలిచ్చిన భూముల్లో మొక్కలు ఎలా నాటుతరు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం రైతులు శుక్రవారం ఫారెస్టు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. అనంతారం గ్రామానికి చెందిన 50 మంది రైతులు తాతముత్తాతల కాలం నుంచి భూములు సాగు చేసుకుంటుండగా, యాభై ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం వారికి పట్టాలిచ్చింది.
అప్పటి నుంచి ఆ భూములే జీవనాధారంగా బతుకుతున్నారు. శుక్రవారం గ్రామ శివారులోని గుట్టల ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ సిబ్బంది జేసీబీలతో చదునుచేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో ఎఫ్‌వో భూలక్ష్మి సిబ్బందితో కలిసి వెనుదిరుగగా, కొద్దిసేపటికే మళ్లీ సిబ్బంది వచ్చి భూములను చదునుచేసి తమకు అన్యాయం చేశారని రైతులు వాపోయారు.