కురవి, డిసెంబర్ 21: రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవిలో నిరాహార దీక్షచేస్తున్న రైతు సహదేవ్ శనివారం నాగలి భుజాన వేసుకుని మహబూబాబాద్ కలెక్టరేట్‌కు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా సహదేవ్‌కు రైతులు బేతమళ్ల సహదేవ్, భూక్యా మంగీలాల్‌నాయక్, మిర్యాల శ్రీనివాస్, నూతకి సాంబశివరావు సంఘీభావం పలికారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సహదేవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి జనవరి 26లోగా రూ.2 లక్షలలోపు ఉన్న రైతులందరికి పంట రుణమాఫీ చేయాలని, లేదంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కలెక్టరేట్ ఎదుట ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు.
ఈ పాదయాత్రకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు కుర్ర మహేశ్, బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు గుగులోత్ రవినాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమానాయక్, అంబేదర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుడు సామెల్, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంగోత్ చందూలాల్, సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు సురేశ్ నాయక్, గిరిజన వికలాంగుల హకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ రాందాస్‌నాయక్, ఎన్పీఆర్డీ మాజీ రాష్ట్ర నాయకుడు సయ్యద్ ఖాజా, రైతులు, జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు.