కంటేశ్వర్( నిజామాబాద్ ) : పసుపునకు ( Turmeric ) కనీస మద్దతు ధర చెల్లించాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా (Farmers Protest ) చేపట్టారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని, పసుపు బోర్డు ( Turmeric Board ) పేరుతో దగా చేస్తున్నారని నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు ధర్నాను విరమించబోమని మొండికేశారు.
నిజామాబాద్ ( Nizamabad ) మార్కెట్ యార్డ్ మొత్తం దళారులు, వ్యాపారుల చేతిలో ఉందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలు నిర్ణయిస్తున్నారని, మార్కెట్లో వచ్చిన పసుపునకు నాణ్యత లేదని వంక చూపుతూ రైతును నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు పసుపు తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కూడా పసుపు కొనడం లేదని ఆరోపించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన రేటుకు పసుపు విక్రయించి కన్నీటితో తిరిగి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్ యార్డులో వందల కుప్పల పసుపు ఉన్నప్పటికీ కేవలం ఒకటి, రెండు కుప్పలను పరిశీలిస్తున్నారని, పూర్తిస్థాయిలో పసుపు పరిశీలించకుండానే నాణ్యత లేదని వంకతో కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదని అన్నారు. ఏసీ రూములలో కూర్చునే అధికారులకు రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు రావడంతో ఆశపడి, మార్కెట్లో మంచి మద్దతు లభిస్తుందని ఇక్కడికి వస్తే ఇక్కడున్న వ్యాపారులు నాణ్యత సరిగా లేదన్న కారణంగా నిండా ముంచుతున్నారని ఆరోపించారు. పసుపునకు కనీస మద్దతు ధర రూ.15 వేలు వస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని అన్నారు. దాదాపు గంటకు పైగా రైతులు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్థంబించిపోయింది.
కలెక్టర్ వస్తేనే ధర్నాను విరమిస్తామని స్పష్టం చేయడంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ వచ్చి రైతులను సముదాయించారు. మార్కెట్లో వచ్చిన పసుపును పరిశీలించేందుకు మార్కెట్ యార్డుకు రావాలని కోరగా రైతులు ధర్నాను విరమించారు. మార్కెట్ యార్డులో పసుపును పరిశీలించిన అదనపు కలెక్టర్ రైతులకు సరైన ధర వచ్చే విధంగా మాట్లాడుతామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.