షాబాద్, జనవరి 22: రైతుల సాగు భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో పచ్చని పొలాల జోలికి వస్తే మరో ఉద్యమం తప్పదని స్పష్టంచేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రేగడి దోస్వాడ గ్రామంలో షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ముఖ్యఅథితిగా హాజరయ్యారు.
అంతకుముందు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కంపెనీల పేరుతో ప్రభుత్వం రైతుల వద్ద గుంజుకోవాలని చూస్తున్న రేగడి దోస్వాడ గ్రామంలోని వ్యవసాయ భూములను పరిశీలించారు. ధర్నానుద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. మాడ్గుల మండలంలో రేవంత్‌రెడ్డికి వందల ఎకరాల భూములు ఉన్నాయని, అందులో కంపెనీలు, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతుల భూముల జోలికి వస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ సంపదను ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెడుతున్నాడని ఆరోపించారు. ఎక్కడ సంపద ఉంటే అక్కడ రేవంత్‌రెడ్డి, వాళ్ల మంత్రులు వాలిపోతున్నారని, కష్టాలు ఉన్నచోట బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీశ్‌రావు ఉంటున్నారని తెలిపారు. ఇటీవల ఒరిస్సాలో వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గు గనికి సంబంధించిన పంచాయితీలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారని, వీరంతా ఆ సంపదను ఎలా దోచుకోవాలని చూశారని ఆరోపించారు. బనకచర్లతో మన గోదావరి, కృష్ణా జలాలను దోచుకుపోతున్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకువచ్చి కేసీఆర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చూస్తే 90 శాతం పనులు పూర్తయినా, మిగతా 10శాతం పనులు చేపట్టేందుకు రేవంత్ సర్కార్ ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.