యాచారం, సెప్టెంబర్ 21: యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే నానక్‌నగర్ గ్రామానికి చెందిన 200 మంది రైతులు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఫార్మాసిటీ వద్దంటూ తాజాగా శనివారం కుర్మిద్ద గ్రామానికి చెందిన కొంత మంది రైతులు పోస్టుకార్డులతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలు రాశారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మాసిటీని రద్దుచేయాలని, తమ నుంచి సేకరించిన భూములను తిరిగి ఇవ్వాలని ఆ లేఖల్లో డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీని రద్దు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక మాట మార్చడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులతో కలిసి పాదయాత్ర చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీలు కోదండరామ్, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదవులను చేపట్టగానే ఫార్మా బాధిత రైతులను మర్చిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్యూచర్‌సిటీ అంటున్నారే తప్ప ఫార్మాసిటీని రద్దు చేసినట్టు ఎక్కడా జీవో చూపించడంలేదని మండిపడుతున్నారు. పైగా ఫార్మాసిటీని నిర్మించి తీరుతామని హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని ఇప్పటికైనా ఫార్మాసిటీని రద్దు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులను తమ గ్రామాల్లో తిరుగనివ్వబోమని హెచ్చరించారు.