నారాయణపేట : కొడంగల్ ( Kodangal ) ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు ఆదివారం జాతీయ రహదారిపై రాస్తారోకో ( Rastaroko ) చేశారు. భూములకు బేసిక్ ధర నిర్ణయించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాట్రేపల్లి, ఎర్నాగానిపల్లి, కాచ్వార్ గ్రామాల రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మక్తల్, ఊట్కూర్ మండల కేంద్రాల్లో రైతులు ప్రధాన రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసనలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. లగచర్ల రైతులకు ఇస్తున్న పరిహారమే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూ నిర్వాసితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాట్రేపల్లి నుంచి నారాయణపేట జిల్లాలోని కాన్కుర్తి గ్రామం వరకు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని, ఎత్తిపోతల వల్ల భూముల కోల్పోతున్న రైతులకు, మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతనే, భూ సేకరణ చేపట్టాలని కోరారు.
రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా, రైతులకు తెలియకుండానే రైతుల పొలాల్లోకి వచ్చి సర్వేలు చేయడం, రైతుల వద్ద అవార్డు కాపీలపై బలవంతంగా సంతకాలు చేయాలని ఇబ్బందులకు గురి చేయడం దారుణమని ఆరోపించారు. భూముల కోల్పోయే రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా న్యాయమైన పరిహారం వస్తే తప్ప, భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాస్తారోకో వల్ల ఇరువైపుల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.