ERC | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని, ట్రాన్స్పార్మర్లు కాలిపోతే డీడీలు కట్టి నెలలు గడిచినా ఇచ్చే పరిస్థితే లేదని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కల్యాణ్నగర్లోని విద్యుత్ నియంత్రణ్ భవన్లో టీజీఎస్పీడీసీఎల్ 2025-26కోసం సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, సబ్సిడీ సర్‌చార్జీల ప్రతిపాదనలపై ఈఆర్సీ చైర్మన్ దేవరాజు నాగార్జున అధ్యక్షతన జరిగిన బహిరంగ విచారణలో గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, లోవోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రామస్థాయిలో విద్యుత్‌శాఖ అధికారులు ఏ చిన్న పని చేయాలన్నా.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పంట పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వాటిని రిపేర్షెడ్కు తరలించే పనిని కూడా రైతుల మీదనే వేస్తున్నారని, ఖర్చులు కూడా అన్నదాతలపైనే మోపుతున్నారని నాగర్‌కర్నూల్‌కు చెందిన రైతులు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల తరలింపు బాధ్యతను రైతులపై వేయడం వల్ల ప్రమాదానికి గురై రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు పక్కకు మార్చాలని డిమాండ్ చేశారు. కరెంట్ షాక్‌తో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందడంలేదని, జాతీయ రహదారులపై వీధి దీపాలు సరిగా ఉండడంలేదని, దాని కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని కొందరు రైతులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ సమస్యలతో నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలు కొట్టుమిట్టాడుతున్నాయని ఎస్పీడీసీఎల్ అధికారులే తమకు చెబుతున్నారంటూ ఆయా జిల్లాల నుంచి వచ్చిన రైతులు చెప్పారు. తాము బావుల దగ్గరకు వెళ్లే పరిస్థితే లేదని, పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మీటర్లు ఇవ్వకుండా పెనాల్టీల పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు ఈఆర్సీకి ఫిర్యాదు చేశారు. బహిరంగ విచారణకు హాజరైన వారిలో ఎక్కువమంది విద్యుత్తు సిబ్బందితో సమస్యలు ఉన్నాయని చెప్పారు.
విచారణలో రైల్వే హెచ్ఎంఆర్ఎల్ వేణుగోపాల్‌రావు, డిస్కమ్ జేఎండీ శ్రీనివాసరావు, పలువురు సీజీఎంలు, సీఈలు, ఎస్ఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. నారాయణ్‌పేట జిల్లా కోస్గి మండలం నుంచి వచ్చిన సరిత అనే మహిళ తన భర్త సంజీవరెడ్డి విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని, పరిహారం అందలేదని ఈఆర్సీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఎక్స్‌గ్రేషియాకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలంటూ డిస్కమ్ అధికారులను చైర్మన్ ఆదేశించారు. డిస్కమ్ అదికారులు యుద్ధప్రాతిపదికన ఫైల్ ప్రాసెస్ చేసి రూ.5లక్షలకు చెక్ సిద్ధం చేయగా నాగార్జున చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
విద్యుత్ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించేలా గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని టీజీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున చెప్పారు. ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారమైతే ప్రత్యేక సమావేశాల అవసరమే ఉండదని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించేలా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపు ప్రతిపాదన లేదని, కరెంట్ చార్జీలలో ఎలాంటి మార్పు ఉండదని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారుఖీ తెలిపారు. టైమ్ ఆఫ్ డే ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే వినియోగదారులకు మాత్రం సాధారణ టారిఫ్ కంటే యూనిట్‌కు రూ.0.66 గ్రీన్ టారిఫ్ విధింపు ఉంటుందని వెల్లడించారు.
డీడీ కట్టి ఎన్ని నెలలైనా ట్రాన్స్ఫార్మర్లు వస్తలేవు. సిబ్బందిని అడిగితే పట్టించుకుంటలేరు. పదహారునెలలైనా ఇంకా రాలేదు. వ్యవసాయమెట్ల కావాలె. పొలాలు ఎండిపోయినయి. పొలంలో ఎడ్లు కట్టేసి ఇక్కడికి వచ్చిన. – కిష్టయ్య, షాబాద్
నా మామిడి తోట దగ్గర పాత పోల్లు, లైన్ల మార్పిడి విషయంలో 2022లో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు మాకు బడ్జెట్ సాంక్షన్ చేశారు. కానీ ఇప్పటివరకు మెదక్‌జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో ఆ సమస్యే పరిష్కారమవడం లేదు. డీడీలు కట్టి నెలలు గడిచినా ట్రాన్స్ఫార్మర్లు రావడం లేదు. గద్దెలు కాంట్రాక్టర్లే కట్టియ్యాలి. కానీ రైతులే కట్టుకోవాలని అధికారులు చెప్తున్నరు. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో కరెంట్ ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో తెలియదు.