రామాయంపేట రూరల్/వెల్దుర్తి/గుండా ల/భీమ్‌గల్, ఆగస్టు 27 : రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరుకడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ మేరకు గు రువారం మెదక్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. యూరియా వ చ్చిందని అధికారులు చెప్పడంతో గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ రైతులు యాప్ ఓపెన్ చేశారు. అప్పటికే బుక్ అయిపోయిందని రావడంతో ఆగ్రహించిన రైతులు కోనాపూర్‌లో రామాయంపేట-సిద్దిపేట రోడ్డుపై రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ దిక్కుమాలిన యాప్ తెచ్చి అరిగోస పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు వచ్చి సముదాయించడంతో రైతులు ఆందోళన విరమింపజేశారు.
మెదక్ జిల్లా మాసాయిపేట సొసైటీకి గురువారం యూరియా లారీ రావడంతో బుకింగ్ కోసం వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు యాప్ ఓపెన్ కావడంతో బుక్ చేసేందుకు ప్రయత్నించగా ఒక్కరికి కూడా బుక్ కాలేదు. దీంతో వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతటితో ఆగకుండా రైతులు మాసాయిపేటలో 44వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకొని ధర్నా నిర్వహించారు. ఇరువైపులా సుమారు గంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. చేగుంట ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి వచ్చి రైతులను బుజ్జగించారు.
యూరియా కోసం యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. యాప్ ద్వారా యూరియా సరిపడా అందడం లేదంటూ పీఏసీఎస్ యూరియా కేంద్రానికి తాళం వేశారు. యాప్ ద్వారా యూరియా దొరుకడం లేదంటూ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లోని సొసైటీకి తాళం వేయగా, అదే మండలంలోని బడా భీమ్‌గల్‌లో ధర్నాకు దిగారు. ఉదయం 9 నుంచి యాప్‌లో యూరియా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు ఉదయం 8.30 గంటల నుంచే యాప్ ఓపెన్ చేసుకుని పెట్టుకున్నారు. స్టాక్ అప్లోడ్ చేసిన సెకన్ల వ్యవధిలోనే నో స్టాక్ అని చూపించడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. దీంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు.